హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ చిరంజీవి భారతీయ జనతాపార్టీలో చేరతారని, సోదరుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి రానున్న కాలంలో టీడీపీ, కాంగ్రెస్, వైసీపీలకు సమాంతరంగా బలమైన రాజకీయశక్తిగా ఎదగబోతున్నారని కొద్దికాలంగా సోషల్ మీడియాలో ఊహాగానాలు జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. దానికి తోడు సంప్రదాయ మీడియాలో కూడా తొలిసారిగా ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ఇవాళ ఇదే అంశంపై ఓ సంచలన కథనాన్ని ఇచ్చింది.
మార్చి 6న రాజమండ్రిలో జరిగే బీజేపీ బహిరంగసభలో అమిత్ షా సమక్షంలో చిరంజీవి కాషాయ కండువా కప్పుకోనున్నారని నమస్తే తెలంగాణ రాసింది. ఏపీలో సొంతంగా ఎదగాలనే ఆలోచనలో ఉన్న బీజేపీ ‘కాపులకు ముఖ్యమంత్రి పదవి’ అనే నినాదంతో చిరంజీవిని తమవైపు తిప్పుకోవాలని చూసోందని పేర్కొంది. ఇటు చిరును పార్టీలోకి చేర్చుకుని, అటు పవన్ జనసేనతో పొత్తు పెట్టుకుని 2019 ఎన్నికల్లో బలమైన శక్తిగా ఎదగాలని బీజేపీ వ్యూహాలు పన్నుతోందని రాసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాపు కులానికే చెందిన సోము వీర్రాజును ప్రకటించి, చిరంజీవికి కేంద్రమంత్రి పదవి ఇచ్చి కాపులను పూర్తిగా తమవైపుకు తిప్పుకోవాలన్నది బీజేపీ వ్యూహంగా కనబడుతోందని పేర్కొంది.
బీజేపీలో చేరిక ఊహాగానాలపై చిరంజీవి ఎట్టకేలకు స్పష్టత ఇచ్చారు. పార్టీ మారే ఆలోచన లేదని, తాను కాంగ్రెస్ పార్టీని వీడబోనని స్పష్టీకరించారు. రాజకీయాలలో ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. సోషల్ మీడియాలో ఈ విషయంపై సాగుతున్న రకరకాల ఊహాగానాలను ఖండిస్తున్నానని, వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారు. కొందరు కావాలనే ఈ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇవాళ జుబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో జరిగిన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో చిరంజీవి సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు బీజేపీలో చేరికపై అడగగా, ఆగ్రహం వ్యక్తం చేస్తూ పై విధంగా స్పందించారు.