తాను క్యాన్సర్ బారిన పడ్డానని.. చికిత్స తీసుకుని బయట పడ్డానని చెప్పానంటూ జరుగుతున్న ప్రచారాన్ని మెగాస్టార్ చిరంజీవి ఖండించారు. స్టార్ క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో తాను 45 ఏళ్ల వయసులో అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నానని అందులో non – cancerous polyps ని డిటెక్ట్ చేసి తీసేశారని మాత్రమే చెప్పానన్నారు. ‘అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో’ అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు..స్క్రీనింగ్ చేయించుకోవాలని సలహా ఇచ్చానన్నారు. మాత్రమే అన్నాను.
క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడానని… రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పానన్నారు. కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యం తో ‘నేను క్యాన్సర్ బారిన పడ్డాను’ అని ‘చికిత్స వల్ల బతికాను’ అని స్క్రోలింగ్ లు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయవద్దని జర్నలిస్టులకు సూచించారు.
స్టార్ ఆస్పత్రి కార్యక్రమంలో చిరంజీవి కొన్ని కీలక అంశాలు తెలిపారు మొగల్తూరులో తన స్నేహితుడు సైతం ఊపిరితిత్తుల సమస్య వచ్చిందని, ఆ తర్వాత అది క్యాన్సర్ అని తేలిందని చిరంజీవి తెలిపారు. అతను హైదరాబాద్ వచ్చినప్పుడు రెండో దశ క్యాన్సర్ అని తెలిసి వెంటనే చికిత్స ప్రారంభించామని, ఇప్పుడు తన స్నేహితుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడని చిరంజీవి తెలిపారు.
సినిమా కార్మికులు, అభిమానుల కోసం ఏదైనా చేయమని స్టార్ ఆస్పత్రి వర్గాలను చిరంజీవి కోరారు. సినిమా కార్మికులు చాలా పేదవాళ్ళు. రేయి పగలు, దుమ్ము ధూళి, మట్టి వాన వంటివి పట్టించుకోకుండా పని చేస్తారు. ఎవరికి ఏ విధమైన వ్యాధి వస్తుందో తెలియదు. ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించినవి వస్తుందో తెలియదు. అటువంటి వాళ్లకు ఏమైనా చేయగలిగితే బావుంటుంది. వాళ్ళ కోసం, మా అభిమానుల కోసం ప్రతి జిల్లాలో స్క్రీనింగ్ వంటి పరీక్షలు చేస్తే బావుంటుంది. ఎన్ని కోట్లు అయినా పర్వాలేదన్నారు. చిరంజీవి ఎలా చేద్దామని చెబితే అలా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్టార్ హాస్పిటల్ ప్రతినిథులు చెప్పారు. ప్రతి వారం, రెండు వారాలకు ఒకసారి అయినా సరే క్యాంపులు పెడదామని ఆస్పత్రి వర్గాలు ప్రతిపాదించాయి.