ఎంతకాదన్నా చిరంజీవి మెగాస్టార్. ఎవరు అవున్నా.. కాదన్నా.. ఇండస్ట్రీకి ఆయనే పెద్ద దిక్కు. చిరుతో కలిసి నటించాలని, ఆయనతో పని చేయాలని ఎవ్వరైనా కోరుకోవడం సహజం. అలాంటిది చిరంజీవే.. ‘మీతో కలిసి నటించాలని వుంది.నాతో ఎప్పుడు పనిచేస్తావు’ అని అడిగాడంటే… ఆశ్చర్యం వేస్తుంది. ఆయనేమైనా హేమా హేమీల్ని, తన స్థాయి నటుల్ని, సూపర్ స్టార్లనీ ఈ మాట అడిగాడంటే.. అర్థం చేసుకోవొచ్చు. చిరు ఈ కోరిక కోరింది.. రావు రమేష్ ని.
పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. రావు రమేష్ గురించి ప్రస్తావిస్తూ… ‘నాతో కలిసి ఒక్కసినిమా కూడా చేయలేదు. ఎప్పుడు చేస్తావు..?’ అని అడిగారు చిరు. రావు రమేష్ ప్రతిభావంతుడైన నటుడే. కాకపోతే.. చిరు స్థాయి ఏమిటన్నది అభిమానుల ప్రశ్న. చిరు ఇన్ని సినిమాలు చేస్తున్నాడు కదా.. ‘ఈ పాత్రకు రావు రమేష్‌ని తీసుకోండి’ అంటే… ఎవరు మాత్రం తీసుకోరు..? చిరు సినిమాలో ఆఫర్ వచ్చిందంటే.. రావు రమేష్ కాదంటాడా..? రావు గోపాల్రావుతోనే .. ఢీ అంటే ఢీ అంటూ నటించిన చిరుకి.. రావు రమేష్‌తో నటించాలన్న కోరిక ఉండడం… దాన్ని సభాముఖంగా బయటపెట్టడం.. అభిమానులకు అంతగా రుచించడం లేదు.
ఇదనే కాదు.. వేదికపై ఎవరైనా హీరోయిన్ కనిపిస్తే… ‘నీతో కలిసి స్టెప్పులు వేయాలని ఉంది’ అని అడగడం.. చిరు స్థాయికి తగదన్నది అభిమానుల మాట. మొన్నా మధ్య సాయి పల్లవితో కూడా చిరు ఇదేమాట అన్నారు. అంతకు ముందు తమన్నాతో ఇదే విషయం ప్రస్తావించారు. డాన్స్ లో ఆయన కింగ్. ఆ విషయాన్ని అందరూ ఒప్పుకొని తీరతారు. చిరుతో కలిసి స్టెప్పులు వేయాలని ఆ హీరోయిన్లకి ఉండాలి తప్ప… చిరుకెందుకు అనిపిస్తుంది? తనని తాను తగ్గించుకొన్న వాడు.. హెచ్చించబడతాడు. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు.. ఈ వాక్యాలు వినడానికి బాగుంటాయి. కానీ… చిరంజీవి లాంటి వాడు తగ్గి మాట్లాడితే.. ఫ్యాన్స్ హర్టయిపోతారు. ప్రస్తుతం మెగా అభిమానుల్లో ఇలాంటి చర్చే జరుగుతోంది.