వాల్తేరు వీరయ్య సినిమా కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా వెబ్ సైట్లకు కూడా ఇంటర్యూలు ఇస్తున్న చిరంజీవి కొన్ని సందర్భాల్లో కంట్రోల్ తప్పి పోయి సమాధానాలిచ్చినట్లుగా కనిపిస్తోంది. సినిమాకు సంబంధించిన ఇంటర్యూలు ఇస్తున్నాను కాబట్టి.. సినిమా కు సంబంధించిన ప్రశ్నలే వేయాలని ముందుగా రిపోర్టర్లకు కండిషన్ పెట్టి ఉంటే సమస్య ఉండేది కాదేమో కానీ.. వచ్చిన వారు సినిమా గురించి తప్ప… ఇతర విషయాల గురించి ఎక్కువ ప్రస్తావించారు. దీంతో కొన్ని సార్లు చిరంజీవి తన అభిప్రాయాలను పూర్తి స్థాయిలో వ్యక్తం చేయలేకపోయారు. ఫలితం సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
ఓ టీవీ చానల్ ఏపీ రాజకీయాల గురించి ప్రస్తావించారు. అయితే రాజకీయాల గురించి పూర్తిగా మాట్లాడటం మానేసిన చిరంజీవి ఇక్కడ మాత్రం కంట్రోల్ తప్పారు. ఏపీ పొరుగు రాష్ట్రామని.. తాను తెలంగాణ ఓటర్ నని.. ఏపీ రాజకీయాల గురించి తనకేం తెలియదని స్పష్టం చేశారు. తన కుటుంబసభ్యుడు పార్టీ పెడితే తనకేం సంబంధం అన్నారు. ఈ వ్యాఖ్యలను ఆ టీవీ చానల్ హైలెట్ చేసింది. సినిమా గురించి పబ్లిసిటీ చేయకుండా ఈ వివాదాస్పద వ్యాఖ్యలను పట్టుకుంది. ఇక చర్చలు పెట్టినా ఆశ్చర్యపోయే అంశం కాదు. మరో గాసిప్ సైట్ కు ఇచ్చిన ఇంటర్యూలో.. తన తండ్రి గురించి చెప్పుకోవడం.. చరణ్ ఎక్కడైనా తన గురించి చెప్పకపోవడంపై ఆయన చేసిన వ్యాఖ్యలను మరింతగా వక్రీకరించి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
ఇన్ని ఇంటర్యూలు ఇచ్చినప్పుడు చిరంజీవి అయినా మరొకరు అయినా.. ద్వందార్థాలు రాకుండా జాగ్రత్తగా సమాధానాలు చెప్పడం కష్టమే. కానీ.. ఓ సినిమా పబ్లిసిటీ కోసం ఇస్తున్న ఇంటర్యూలను కూడా ఇలా వివాదాలకు మీడియా సంస్థలు వాడుకోవడం.. మాత్రం చాలా మందిని ఆశ్చర్య పరిచింది. చిరంజీవి రాజకీయాలకు దూరమని ప్రకటించారు. ఆ నిర్ణయాన్ని గౌరవించకుండా.. లేనిపోని మాటలకు ద్వందార్థాలు తీసి హైలెట్ చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.