దాసరి చిరంజీవి మధ్య అనుబంధం చిత్రవిచిత్రంగా ఉండేది. ఓ దశలో ఇద్దరూ గురు శిష్యుల్లా ఉండేవారు. ఆ తరవాత.. చిన్నపాటి గ్యాప్ వచ్చింది.చిరంజీవిని దాసరి బాహాటంగానే విమర్శిస్తుండేవారు. మేస్త్రీ సినిమా సమయంలో దాసరి – చిరు మధ్య గ్యాప్ మరింత ఎక్కువైంది. అయితే దాసరి చివరి రోజుల్లో వీరి అనుబంధం బలపడడం మొదలైంది. చిరంజీవి 150 సినిమా ఫంక్షన్ విజయవాడలో జరిగితే.. దానికి అతిథిగా వచ్చిన దాసరి చిరంజీవిని పొగడ్తలతో ముంచెత్తారు. అల్లు రామలింగయ్య జాతీయ అవార్డుని దాసరికి ప్రకటించిప్పుడు.. ఆ బంధం మరింత బలంగా కనిపించింది. ఇప్పుడు దాసరి విషయంలో చిరంజీవి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. ”చాలామందికి తెలియని విషయం. మేమిద్దం బంధువులం కూడా. మా మధ్య చుట్టరికం ఉంది. వరుసకు తాతా మనవళ్లం అవుతాం” అని గుర్తు చేసుకున్నారు చిరంజీవి.
దాసరి నారాయణరావు పుట్టిన రోజుని తెలుగు చిత్రసీమ డైరెక్టర్స్ డేగా జరుపుకుంటోంది. ఈరోజు ఆ వేడుకలు హైదారాబాద్లోని ఎఫ్,ఎన్.సీ.సీలో జరిగాయి. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా దాసరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ”ఆయనతో నేను చేసింది ఒక్క సినిమానే. ఎక్కువ సినిమాలు చేయలేకపోయా అన్న లోటు ఉండేది. చివరి రోజుల్లో మా మధ్య అనుబంధం మరింత బలపడింది. ఓరోజు ఇంటికి పిలిచి బొమ్మిడాయిల పులుసుతో భోజనం పెట్టారు” అని ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. దర్శకుల సంఘానికి చిరంజీవి 25 లక్షల విరాళం ప్రకటించారు. రాజమౌళి రూ.50 లక్షలు, ఆర్కా మీడియా 25 లక్షలు విరాళం ఇచ్చారు.