మహానటి సావిత్రి అంటే అందరికీ గౌరవమే. మరీ ముఖ్యంగా సినిమా వాళ్లకు. ఆమె ప్రతిభని ప్రత్యక్షంగా చూసిన అతి కొద్ది మందిలో చిరంజీవి ఒకరు. చిరు తొలి చిత్రం ‘పునాదిరాళ్లు’లో సావిత్రి నటించిన సంగతి తెలిసిందే. అలా ఆ మహానటితో తొలి సినిమాతోనే పరిచయం ఏర్పడింది. ఆనాటి సంగతుల్ని చిరు ఇప్పుడు గుర్తు చేసుకొన్నారు. మహానటి జీవితంపై వచ్చిన ‘సావిత్రి క్లాసిక్స్’ అనే పుస్తకాన్ని మంగళవారం హైదరాబాద్ లో చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సావిత్రితో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు చిరు.
పునాదిరాళ్లు షూటింగ్ రాజమండ్రిలో జరుగుతున్నప్పుడు స్థానిక పంచవటి హోటెల్ లో చిరు సావిత్రిని తొలిసారి చూశార్ట. ఆమెను చూడగానే ఒళ్లు జలదరించిందని, తన పేరు అడిగి తెలుసుకొని దీవించారని ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లిపోయారు చిరు. మరుసటి రోజు ‘పునాదిరాళ్లు’ షూటింగ్ వర్షం వల్ల ఆగిపోతే.. సరదాగా సెట్లో చిరంజీవి డాన్స్ చేశార్ట. మధ్యలో కాలు జారి కింద పడ్డా… ఆపకుండా డాన్స్ చేసిన చిరుని చూసి సావిత్రి మెచ్చుకొన్నార్ట. దాంతో సెట్లో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా క్లాప్స్ కొట్టారు. అదే సమయంలో సావిత్రి కూడా ‘భవిష్యత్తులో మంచి నటుడు అవుతావు’ అని ఆశీర్వదించార్ట. ఈ విషయాలన్నీ ఈ సందర్భంగా చిరు గుర్తు చేసుకొన్నారు. ఆ తరవాత ‘ప్రేమ తరంగాలు’ అనే ఓ సినిమాలో సావిత్రి – చిరంజీవి తల్లీ కొడుకులుగా నటించారు. వీరిద్దరూ కలిసి నటించడం అదే ఆఖరుసారి. ”కళ్లతోనే కోటి భావాలు పలికించగల నటి సావిత్రి. అలాంటి నటి మళ్లీ పుట్టరు” అంటూ సావిత్రిపై తనకున్న అభిమానాన్ని చాటుకొన్నారు చిరు. సావిత్రి జీవితంలో మర్చిపోలేని సినిమాల్ని గుర్తు చేసుకొంటూ సాగిన ‘సావిత్రి క్లాసిక్స్’ పుస్తకాన్ని సంజయ్ కిషోర్ రాశారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉంది.