సినీ పరిశ్రమని చిరకాలం ఏలిన చిరంజీవి, ఎన్టీఆర్ లాగ రాష్ట్రాన్ని కూడా ఏలేయాలనే కోర్కెతో రాజకీయాలలోకి వచ్చి పడ్డ సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఆ తరువాత ఏమయిందో అందరికీ తెలుసు. మళ్ళీ సినీ పరిశ్రమలోకి వచ్చి పడిన తరువాత ఇక రాజకీయాల గురించి మాట్లాడకుండా ఉంటేనే మంచిది. బీసీలకు అన్యాయం జరగకుండా, వారి ఆగ్రహానికి గురికాకుండా కాపులకు ఏవిధంగా న్యాయం చేయాలో తెలియకనే చంద్రబాబు నాయుడు కమీషన్ వేస్తే, చిరంజీవి ఆ సమస్యను చిటికలో పరిష్కరించవచ్చన్నట్లుగా ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖ వ్రాసి పడేశారు. కాపులకు బీసీలలో చేర్చుతూ శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి దానిని కేంద్రానికి పంపి చేతులు దులుపుకోమని సూచించారు.
దాని పర్యవసానాలు ఆయనకు తెలిసే అటువంటి సలహా ఇస్తున్నారో లేక కాపులను ఆకట్టుకోవాలనే ఆశతోనే ఆవిధంగా లేఖ వ్రాసారో తెలియదు కానీ సున్నితమయిన ఈ సమస్యకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే చిటికలో పరిష్కరించవచ్చని తేల్చి చెప్పేశారు. ఆయనకి విజయశాంతి మద్దతు పలకడం విశేషం. చిరంజీవిలాగే ఆమె కూడా రాజకీయాలలో రాణించలేకపోయారు కనుక బహుశః మళ్ళీ సినీ పరిశ్రమలోకి రావాలని భావిస్తున్నారేమో? ఇద్దరూ కూడా మంచి ప్రతిభ కల నటులే. అలాగే ఇద్దరూ కూడా రాజకీయాలలో తమ శక్తి సామర్ధ్యాలు నిరూపించుకోలేక చతికిలపడినవారే. చిరంజీవి కాపులను ఆకర్షించడానికి ఆవిధంగా అని ఉంటే, విజయశాంతి చిరంజీవిని ప్రసన్నం చేసుకోవడానికి అన్నట్లుంది.
రాజకీయాలలో ఉంటూ సినిమా తారలలాగ, సినిమాలలో ఉంటూ రాజకీయ నేతల్లాగా మాట్లాడటం వలన ప్రజలను ఆకర్షించవచ్చునేమో కానీ దాని వలన ఎటువంటి ఫలితమూ ఉండబోదు. ఒకవేళ చిరంజీవి రాజకీయాలలోనే కొనసాగాలనే ఉద్దేశ్యం ఉంటే ఆయన రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోతున్న కాంగ్రెస్ పార్టీని కాపాడుకొనే ప్రయత్నం చేయాలి. కానీ ఆపని చేయకుండా తన 151వ సినిమా తీసుకొంటున్నారు. అటువంటప్పుడు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటే బాగుండేది కానీ మళ్ళీ కాపులకు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ ‘నేను ఇంకా రాజకీయాలలోనే ఉన్నాను’ అని తన ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేస్తున్నారు. దాని వలన ఆయనకు ఒరిగేదేమి ఉండదు కానీ విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది.