ఇండస్ట్రీనే కాదు.. ఇండస్ట్రీలోని వ్యక్తులు కూడా చాలా సున్నితం. చిన్న చిన్న విషయాలకే…అలుగుతారు. కళాకారులు కదా..? ఆ మాత్రం ఉంటుంది. అందుకే ఫ్యాన్స్ కూడా అలానే తయారవుతారు. మా హీరోనే హీరో.. మీ హీరో జోరో అనే మూర్ఖత్వం అబ్బేస్తుంది. వాళ్లు కూడా… ఏమాత్రం ప్రాధాన్యం లేని విషయాలకు పెద్ద పీట వేస్తుంటారు. మొన్నే రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. టాలీవుడ్ మొత్తం చరణ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఒక్క అల్లు అర్జున్ తప్ప. ఇది వరకైతే.. మెగా ఫ్యాన్స్ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బన్నీకీ, రామ్ చరణ్‌కీ మధ్య ఏదో జరుగుతోందన్నది వాళ్ల ఫీలింగ్. బన్నీ చేసే పనులు కూడా అలానే ఉంటాయి.బర్త్ డే రోజున.. విష్ చేస్తే రాద్ధాంతం ఉండేది కాదు కదా? కానీ బన్నీ అలా చేయలేదు.చరణ్ ఇచ్చిన పార్టీలోనూ బన్నీ కనపడలేదు. దాంతో మెగా ఫ్యాన్స్,బన్నీ ఫ్యాన్స్ మధ్య మరోసారి పెద్ద అడ్డగీత వచ్చేసింది. ఈసారి దానికి రీజన్ బన్నీ మాత్రమే.
కట్ చేస్తే.. అల్లు అర్జున్ తన 20 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకొన్న నేపథ్యంలో చిరంజీవి ఓ ట్వీట్ చేశారు. బన్నీ ఎదుగుదల తనకు ఆనందాన్ని కలిగించిందని, ఇలానే.. తను మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. దాంతో.. బన్నీ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక్కడ చిరు వ్యక్తిత్వం మరోసారి బయటపడింది. వాళ్ల మధ్య ఎన్ని ఈగోలు ఉన్నా,గొడవలు ఉన్నా, వాటన్నింటినీ మర్చిపోయి – స్పందించే గుణానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇదిగో.. ఇలాంటి విషయాలే చిరు నుంచి ఈతరం నేర్చుకోవాలి. అన్ని విషయాల్లోనూ తనకు చిరంజీవినే ఆదర్శం అని చెప్పుకొనే బన్నీ.. ఈ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోవడం లేదో మరి..! ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లయ్యింది. ఈ ప్రయాణంలో బన్నీ హిట్లూ, ఫ్లాపులు చవి చూశాడు. మెల్లమెల్లగా ఎదిగి, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఫ్యాన్స్ మధ్య ఈగోలు.. వాళ్ల లెక్కలు బన్నీకి తెలియంది కాదు. ఎంతకాదన్నా.. బన్నీ కూడా మెగా హీరోనే. తనని చిరంజీవి ఇంటి నుంచి వచ్చిన మరో హీరోగానే ఫ్యాన్స్ భావించారు. మెగా ఫ్యాన్స్ అండతోనే బన్నీ ఎదిగాడు. అలాంటప్పుడు మెగా ఫ్యాన్స్ హర్టయ్యే చిన్న చిన్న విషయాల పట్ల..బన్నీ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇరవై ఏళ్ల అనుభవం వచ్చాక కూడా.. బన్నీ చిరు నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయంటే ఆశ్చర్యమే.