చిరంజీవి ఎప్పుడూ అందరివాడిగా… అజాత శత్రువుగా ఉండాలనుకొంటారు. తన మాటల్లోనూ, ప్రవర్తన ధోరణిలోనూ అది స్పష్టంగా కనిపిస్తుంది. ‘హనుమాన్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని చిరు వస్తున్నారని తెలిసినప్పుడు.. ‘హనుమాన్’ ఎదుర్కొంటున్న థియేటర్ల సమస్యని ప్రస్తావిస్తారని, హనుమాన్‌కి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడతారని అంతా అనుకొన్నారు. కానీ… చిరు ఆ జోలికే వెళ్లలేదు. సరి కదా, ‘హనుమాన్’ని ‘శతమానం భవతి’తో పోల్చారు. ఓ సంక్రాంతికి పెద్ద సినిమాలతో ‘శతమానం భవతి’ పోటీ పడిందని, ఆ సినిమా కూడా మంచి వసూళ్లనే అందుకొందని, పండగ పోటీ వల్ల కావల్సిన సంఖ్యలో థియేటర్లు దొరక్కపోవొచ్చని, కానీ.. రెండో రోజు, మూడో రోజు మౌత్ టాక్ని బట్టి థియేటర్లు పెరుగుతాయని, ఈ పండక్కి వస్తున్న సినిమాలన్నీ ఆడాలని, అందులో హనుమాన్ కూడా ఉండాలని, పరిశ్రమ కళకళలాడాలని చిరంజీవి ఆకాంక్షించారు. దిల్ రాజు తెలివైన వాడని, ఎప్పుడు ఏ సినిమా ఆడుతుందో తనకు బాగా తెలుసని చిరు ఈ సందర్భంగా అక్కడ లేని దిల్ రాజుకి సైతం కితాబు ఇచ్చారు.
చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దగా గుర్తిస్తున్నారంతా. ఆయన ‘నేను ఇండస్ట్రీ బిడ్డనే’ అంటున్నా, ఓ సినిమా తరపున నిలబడి, మాట్లాడగలిగిన హక్కు, అర్హత చిరుకి అన్ని విధాలా ఉన్నాయి. చిరు మాట్లాడితే పనులైపోతాయా? హనుమాన్‌కి థియేటర్లు ఇచ్చేస్తారా? అంటే చెప్పలేం కానీ, కనీసం చిన్న సినిమాల తరపున ఓ గొంతు గట్టిగా వినిపించే అవకాశం ఉంటుంది. కానీ ఈ వేడుక ని చిరు అందుకోసం వాడుకోలేదు. వివాదాలకు దూరంగా ఉండాలన్న ఆలోచనతో చిరు థియేటర్ల ఊసెత్తలేదనిపిస్తోంది. ఈ సందర్భంగా హనుమాన్ టీమ్ ని కూడా మెచ్చుకోవాలి. వార్ జోన్లో దిగామని, యుద్ధం చేస్తున్నామని హీరో, దర్శకుడు చెప్పారు కానీ, థియేటర్ల విషయంలో అన్యాయం జరిగిందని వాళ్లు కూడా ఎవరినీ నిందించలేదు. ‘హనుమాన్’ విషయంలో అన్యాయం జరిగిందన్న విషయం నిజం. హైదరాబాద్ లో 70 సింగిల్ థియేటర్లుంటే… ఈ పండక్కి హనుమాన్‌కి దక్కినవి నాలుగో.. ఐదో. వాటితోనే ఈ సినిమా సరిపుచ్చుకోవాల్సి వస్తోంది. ఇలాంటి మూమెంట్ లో కూడా హనుమాన్ ఎవరినీ నిదించడం లేదు. మరి చిరు చెప్పినట్టు మౌత్ టాక్ ఈ సినిమాని కాపాడుతుందా? చూడాలి.. మరి.