చిరులో గొప్ప నటుడే కాదు. చమత్కారి కూడా ఉన్నాడు. మైకు పట్టుకొంటే… తను బయటకు వస్తుంటాడు. ఈరోజూ అదే జరిగింది. ప్రముఖ సినీ జర్నలిస్టు ప్రభు రాసిన ‘శూన్యం నుండి శిఖరాగ్రం వరకూ’ పుస్తక ఆవిష్కరణ కోసం చిరు విచ్చేశారు. జర్నలిస్టులతో తన అనుభవాల్ని పంచుకొన్నారు. ఈ తరానికి పాత తరం నటీనటుల గొప్పదనం చెప్పాల్సిన అవసరం ఉందని చెబుతూ.. ఈ సందర్భంగా తన ఇంట్లోనే తన పరిస్థితిని సరదాగా చెబుతూ నవ్వించారు.
”మా ఇంట్లో నా మనవలు. మనవరాళ్లూ ఎంత సేపూ… చరణ్, తేజ్, వైష్ణవ్ల పాటలు, సినిమాలే వేయమంటుంటారు. నా సినిమా ల గురించీ నా పాటల గురించీ ఎవరూ పట్టించుకోరు. దాంతో నా మనసులో ఒకరకమైన జెలసీ ఫీలింగ్ పుట్టుకొస్తుంటుంది. వాళ్లందరినీ కూర్చోబెట్టుకొని… నా గురించి నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సిన పరిస్థితి. లాక్ డౌన్లో వాళ్లందరికీ కూర్చోబెట్టి నా సినిమాలూ, నా పాటలూ చూపించా..? ‘భయ్యా’ ఇది నువ్వా..? అంటూ వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఇంత వయసు పెరిగినా.. వాళ్లు నన్ను భయ్యా అంటుంటారు. ఆ విషయంలో సంతోషమే. అలా నా గురించి నేనే నా ఇంట్లో సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సివచ్చింది. అదృష్టం ఏమిటంటే… వాళ్లందరికీ నా గాడ్ ఫాదర్ నచ్చింది. ఒకొక్కరూ నాలుగు సార్లు చూశార”న్నారు.
తెలుగు సినీ జర్నలిజాన్నీ, పోకడల్ని చిరు ఈ సందర్బంగా విశ్లేషించారు. తమిళంలో పోలిస్తే తెలుగు సినిమా జర్నలిజం ఆరోగ్యవంతంగా ఉందని, నెగిటీవ్ విషయాలూ, గాసిప్పులూ రాయరని, ఈ విషయంలో జర్నలిస్టులకు హ్యాట్సాఫ్ అంటూ కొనియాడారు. ”అప్పట్లో ఓ తమిళ పత్రికలో కిస్ కిస్ అనే కాలమ్ వచ్చేది. అందులో అన్నీ అభూత కల్పనలు రాసేవారు. అవి చదివి హీరోయిన్లు బాధ పడిన సందర్భాలున్నాయి. తెలుగులో అలాంటి వాతావరణం లేదు. అప్పుడప్పుడూ చిన్న చిన్నవి ఇక్కడా జరుగుతాయి. అయితే వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదం”టూ… తెలుగు సినీ మీడియాకు మంచి మార్కులే వేశారు చిరంజీవి.