ఈమధ్యకాలంలో దాదాపు 10మంది దర్శకులు చిరంజీవి కోసం కథలు సిద్ధం చేసుకొన్నారు. అందులో నాలుగైదు సినిమాల అనుభవం ఉన్న దర్శకుల నుంచీ, దశాబ్దాల నుంచి రాటుదేలిపోయిన సీనియర్లు ఉన్నారు. వాళ్లలో కొందరి కథలు ఓకే అయ్యాయని వార్తలు వచ్చాయి. సినిమాలు కూడా ‘ఇదిగో.. అదిగో’ అన్నారు. కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. అనూహ్యంగా శ్రీకాంత్ ఓదెల ఓ కథ చెప్పి, సింగిల్ సిట్టింగ్ లోనే చిరంజీవి నుంచి గ్నీన్ సిగ్నల్ వేయించుకొన్నాడు. ఈ కాంబోనే అనూహ్యమనుకొంటే, నాని ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోవడం మరో ఆశ్చర్యకరమైన అంశం. శ్రీకాంత్ ఓదెల టాలెంట్ గుర్తించి, దర్శకుడిగా పరిచయం చేసింది నానినే. ‘దసరా’ తో శ్రీకాంత్ ఓదెల తన స్టామినా ఏమిటో చూపించాడు. ఆ తరవాత సినిమా కూడా నానితోనే ఓకే అయ్యింది. ఈలోగా చిరంజీవి కోసం కథ రాసుకోవడం, అది చిరుకి వినిపించడం, ఆయన ఓకే అనేయడం, అధికారిక ప్రకటన కూడా రావడం చక చక జరిగిపోయాయి.
ఈ ప్రాజెక్ట్ ఇంత ఫాస్ట్ గా కదలడానికి ప్రధాన కారణం.. నానినే. చిరు వరకూ ఈ కథ తీసుకెళ్లి, శ్రీకాంత్ తో మీటింగ్ సెట్ చేయడం, వెంటనే అఫీషియల్ గా ప్రకటించడం.. ఈ విషయాల్లో నానినే చొరవ తీసుకొన్నాడు. పైగా క్లాప్ కొట్టకముందే ఈ ప్రాజెక్ట్ పై హైప్ క్రియేట్ చేస్తున్నాడు నాని. కాన్సెప్ట్ పోస్టర్‌తో మెగా ఫ్యాన్స్ కి కిక్ వచ్చింది. చిరంజీవి కెరీర్లో ఇంత రక్తపాతం మరే సినిమాలో చూసి ఉండరంటూ… ఫ్యాన్స్ ని వేడెక్కిస్తున్నాడు నాని. ఈరోజు చిరు, శ్రీకాంత్ ఓదెల కలిసి ఉన్న ఓ ఫొటో వదిలారు. వారిద్దరి చేతులూ రక్తసిక్తమై ఉన్నాయి. ‘ఇట్స్ ఏ బ్లడ్ ప్రామిస్’ అనే క్యాప్షన్ జోడించారు. దీన్ని బట్టి వెండి తెరపై ఎంత రక్తపాతం పారుతుందో ఊహించుకోవొచ్చు. ఈ కాంబోపై అప్పుడే మీమ్స్ రావడం కూడా మొదలైపోయాయి. నాని తన సినిమాల్ని చాలా డిఫరెంట్ గా ప్రమోట్ చేసుకొంటుంటాడు. కథ ఓకే చేయడానికి ఎంత శ్రమిస్తాడో, సినిమాని జనంలోకి తీసుకెళ్లడానికి అంతగా కష్టపడతాడు. ఇది చిరంజీవి సినిమానే కావొచ్చు. కానీ ఈ ప్రాజెక్ట్ వెనుక నాని ఆలోచనలు ఉన్నాయి. ఇక మీదట ఇది నాని సినిమా కూడా. అందుకే ఈ ప్రాజెక్ట్ మరింత ఆసక్తికరంగా మారింది.