ఖైదీ నెం.150కి రామ్‌చరణ్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. డాడీ సినిమా అనో, జనాల్లో క్రేజ్ ఉందనో విచ్చల విడిగా ఏం ఖర్చు పెట్టలేదు చరణ్. టెక్నికల్‌గా స్ట్రాంగ్ టీమ్ తీసుకొని, ఆర్టిస్టుల పరంగా కాస్త పిసినారితనం ప్రదర్శించాడు. అలీ, విలన్ గ్యాంగ్ మినహాయిస్తే.. నోటెడ్ ఆర్టిస్టులు ఎవరూ లేరు ఈ సినిమాలో. ప్రొడక్షన్ పరంగానూ వీలైనంత తక్కువలో సినిమా అయ్యేలా చూసుకొన్నాడు. అందుకే భారీ లాభాల్ని మూటగట్టుకోగలిగాడు. అయితే.. 151వ సినిమా విషయంలో చిరు స్ట్రాటజీ మొత్తం మారిపోయింది. టెక్నికల్ టీమ్ విషయంలో ఎంత ఖర్చయినా సరే… అనుభవం ఉన్నవాళ్లనే తీసుకోవాలని చిరు ఫిక్సయ్యాడట. కాస్టింగ్ విషయంలోనూ అంతే. అనామకుల్ని పక్కన పెట్టి, చిన్న పాత్రకైనా పేరున్న నటీనటులనే తీసుకోవాలని చిరు భావిస్తున్నట్టు సమాచారం.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోసం బాలీవుడ్ కథానాయికని తీసుకోవాలన్న ప్లాన్ అందులో భాగంగా పుట్టినదే. ప్రతినాయకుడు, కొన్ని ముఖ్యమైన పాత్రల కోసం తమిళం, హిందీ సీమలనుంచి పేరున్న నటీనటుల్ని ఎంచుకోవాలని సురేందర్‌రెడ్డి ప్రయత్నాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది. అటు టెక్నికల్ టీమ్కీ, ఇటు నటీనటులకూ భారీగానే ఖర్చు పెట్టబోతున్నారన్నమాట. ఉయ్యాల వాడకు దాదాపుగా రూ.100 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు వార్తలొస్తున్నాయి. ఈ అంకె పెరిగే అవకాశమూ లేకపోలేదు. చిరు పారితోషికంతో కలుపుకొంటే… ఈ సినిమా బడ్జెట్ రూ.120 కోట్లు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు ట్రేడ్ నిపుణులు.