అరవై ఎనిమిదేళ్ల వయస్సు. అందులో సగానికి పైగా చిత్రసీమ ప్రయాణం. ఆ సగంలో సగం సంవత్సరాలు నెంబర్ వన్ కిరీటాన్ని వయం చేసుకొన్న వైనం.. ఇదీ మెగాస్టార్ అంటే. మొన్నటికి మొన్నే పద్మ విభూషణ్ వరించింది. అయినా ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో సాధించాలన్న కసి ఆయనలో కనిపిస్తూనే ఉంది. పద్మ విభూషణ్ సంబరాల్లోంచి మెగా అభిమానులు ఇంకా తేరుకోకముందే, చిరు తదుపరి సినిమా సన్నాహాల్లో పడిపోయారు.
చిరు నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఇటీవలే యాక్షన్ సన్నివేశాలకు శ్రీకారం చుట్టారు. చిరంజీవి కూడా తొలిసారి `విశ్వంభర` సెట్లో అడుగు పెట్టబోతున్నారు. అందుకోసం ఆయన కసరత్తులు కూడా ప్రారంభించారు. జిమ్ లో చిరు చెమటలు కక్కుతున్న వైనాన్ని ఓ వీడియోగా రూపొందించి, చిరు తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. గెట్ రెడీ టూ విశ్వంభర అంటూ అభిమానులకు ఓ తీపి కబురు అందించారు. ఈ రోజు నుంచే చిరు సెట్స్ లో అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.