తమిళ స్టార్ హీరో విజయ్‌కాంత్ కన్నుమూత అభిమానుల్ని కలచి వేస్తోంది. తెలుగులో విజయ్ కాంత్ నేరుగా సినిమాలేం చేయలేదు. కానీ.. ఇక్కడా ఆయన సుపరిచితుడే. ‘కెప్టెన్ ప్రభాకర్’ తెలుగులో మంచి వసూళ్లని అందుకొంది. అప్పటి నుంచీ విజయ్ కాంత్ నటించిన సినిమాలన్నీ తెలుగులో డబ్బింగ్ రూపంలో వచ్చేవి. విజయ్ కాంత్ పోలీస్ సినిమాలన్నీ దాదాపుగా తెలుగులోనూ ఒకేసారి అనువాద రూపంలో విడుదలయ్యేవి.
విజయ్‌కాంత్ నటించిన తమిళ చిత్రాలు తెలుగులో రీమేక్ రూపంలో వచ్చాయి. ముఖ్యంగా చిరంజీవికి ఆయా కథలన్నీ బాగా కలిసొచ్చాయి. చిరంజీవి కెరీర్లో మర్చిపోలేని సినిమా ‘ఠాగూర్’. తమిళంలో ‘రమణ’ చిత్రానికి ఇది రీమేక్. అక్కడ విజయ్‌కాంత్ పోషించిన పాత్రని తెలుగులో చిరంజీవి చేశారు. అంతకు ముందు ‘సత్తం ఓరు ఇరుత్తరై’ సినిమా తెలుగులో ‘చట్టానికి కళ్ళు లేవు’గా వచ్చింది. రెండూ హిట్లే. విజయకాంత్ తమిళ సినిమా ‘వెట్రి`ని తెలుగులో ‘దేవాంతకుడు’గా తీసుకొచ్చారు. ఆ రెండు సినిమాలకూ ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకుడు. చిరంజీవి సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటూన ‘ఖైదీ నంబర్ 786’ కూడా విజయ్‌కాంత్ ‘అమ్మన్ కోయిల్ కళిక్కలే’ నకలే. అలా.. చిరంజీవికి విజయ్‌కాంత్ కథలు బాగా ఉపయోగపడ్డాయి. కాకపోతే విజయ్‌కాంత్ స్టైల్ వేరు, చిరంజీవి ఇమేజ్ వేరు. చిరుకి తగ్గట్టుగా ఆయా కథల్లో మార్పులూ చేర్పులూ చేశారు. వెంకీ ‘చిన రాయుడు’ సినిమాక విజయకాంత్ నటించిన ‘చిన్న గుండర్’ ఆధారం. అయితే తెలుగులో ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.