పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి ముఖ్య అతిధిగావచ్చిన చిరంజీవి ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ తమ్ముడు పవన్ కళ్యాణ్ కి ఒక సలహా ఇచ్చేరు. “నువ్వు మరో రెండు మూడు సినిమాలు చేసిన తరువాత సినీ పరిశ్రమని వదిలేసి వేరే రంగంలోకి (రాజకీయాలు) వెళ్ళాలనుకొంటున్నావని మీడియాలో వార్తలు చూశాను. అది అంత మంచి ఆలోచన కాదని నేను అభిప్రాయపడుతున్నాను. ఆ విధంగా చేస్తే మనల్ని ఇంతగా ఆదరిస్తున్న అభిమానులంరూ చాలా బాధపడతారు. వారి కారణంగానే మనం నేడు ఈ స్థాయికి చేరుకొన్నాము కనుక వారి మనసులు నొప్పించే పని చేయవద్దని నా సలహా. సినిమాలు చేస్తూనే నువ్వు వేరే రంగంలో కూడా పనిచేయవచ్చును. నువ్వు రెంటిలోను రాణించగలవని నాకు నమ్మకం ఉంది. అది జోడు గుర్రాల సవారీయే కానీ నువ్వు అటువంటి సవారీ చేయ్యగలవని నాకు నమ్మకం ఉంది. సినిమాలలోనే కాదు ఆ రంగంలో కూడా ఉన్నత శిఖరాలు చేరగలవని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఒకప్పుడు సినీ పరిశ్రమలోకి రమ్మని నీకు సలహా ఇచ్చేను. మళ్ళీ ఇప్పుడుదానిని వదిలి వెళ్ళవద్దని సలహా ఇస్తున్నాను. నా సలహాను నువ్వు పాటిస్తావనే అనుకొంటున్నాను,” అని చిరంజీవి అన్నారు.
రాజకీయాల కారణంగా కొంత కాలంపాటు దూరమయిన మెగా బ్రదర్స్ ఇద్దరూ మళ్ళీ ఈవిధంగా దగ్గరవడం, మళ్ళీ చాలా రోజుల తరువాత ఒకే వేదికపైకి వచ్చి ఒకరిపట్ల మరొకరికున్న అభిమానం చాటుకోవడం వారి అభిమానులు అందరికీ చాలా ఆనందం కలిగించింది. ముఖ్యంగా చిరంజీవి తన తమ్ముడికి ఇచ్చిన సలహా విని పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఆయనకు చాలా కృతజ్ఞతలు తెలుపుకొని ఉంటారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆ సలహాను పవన్ కళ్యాణ్ ఒక ఆదేశంగా స్వీకరిస్తారని, అన్న మాటను జవ దాటరని అభిమానులు గట్టిగా నమ్ముతారు. అయితే, ఆ తరువాత మాట్లాడిన పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో దానిపై స్పందించలేదు. అప్పటికప్పుడు అందరి ముందు ఏదో ఒక మాట చెప్పేయడం కంటే ఆయనిచ్చిన సలహా గురించి నిదానంగా ఆలోచించి తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకోవచ్చనే ఉద్దేశ్యంతోనే దాని గురించి మాట్లాడలేదేమో?
ఒకప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ప్రవేశిస్తుంటే తీవ్రంగా వ్యతిరేకించిన చిరంజీవి ఇప్పుడు ప్రోత్సహించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదే ప్రోత్సాహం ఆయన మొదట్లోనో ఇచ్చి ఉండి ఉంటే బహుశః ఇవ్వాళ్ళ పవన్ కళ్యాణ్ రాజకీయాలలోనే ఉండేవారేమో? ఇప్పుడు ఆ చేదు గతాన్ని తవ్వుకోవడం వలన ఎటువంటి ప్రయోజనము లేదు. పైగా అన్నదమ్ములే దానినే మరిచిపోయి మళ్ళీ దగ్గరయినప్పుడు, ప్రజలు, అభిమానులు ఇంక వాటి గురించి ఆలోచించడం అనవసరం. చిరంజీవి తను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఈ మధ్యనే స్పష్టం చేసారు. అలాగే ఇప్పుడు తమ్ముడిని తను ఎంచుకొన్న మార్గంలోనే ముందుకు సాగమని సలహా ఇస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి బద్ధ శత్రువయిన భాజపా, తెదేపాలకు తమ్ముడు మద్దతు ఇచ్చినా లేదా జనసేన పార్టీతో రాజకీయాలలో కొనసాగినా తనకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేస్తున్నట్లే భావించవచ్చును. కనుక ఇక ముందు కూడా మెగా బ్రదర్స్ ఇద్దరూ రాజకీయంగా ఒకరికొకరు దూరంగానే ఉంటారని స్పష్టం అవుతోంది. రాజకీయంగా విభేదిస్తూ, కుటుంబ పరంగా ఈవిధంగా సక్యతగా ఉండగలిగితే మెగాభిమానులు అందరికీ సంతోషమే.