సుకుమార్‌తో వచ్చిన తలనొప్పి ఒక్కటే. మనోడు మహా నిక్కచ్చి. మిస్టర్ పర్ఫెక్షనిస్టులకే పిచ్చి పట్టేంచేసేంత పర్ఫెక్షనిస్ట్. అందుకే.. రీషూట్లు మామూలైన వ్యవహారం. రంగస్థలంకి రీషూట్లు ఎక్కువే జరిగాయని.. ఆ సినిమాని చివరి వరకూ చెక్కుతూనే ఉన్నారని ఫిల్మ్‌నగర్‌లో బోలెడన్ని గుసగుసలు. సినిమా మొత్తం అయ్యాక, రీషూట్లు కూడా పూర్తయ్యాక.. మళ్లీ రీషూట్లు పెట్టుకున్న ఘనత కూడా రంగస్థలంకే దక్కుతుందని కామెడీగా చెప్పుకున్నారంతా. సినిమా అంతా చిరంజీవికి చూపించాక.. ఆయన ఏమైనా మార్పులు చెబితే అప్పుడు కూడా రీషూట్లకు వెళ్దామనుకున్నారు. కానీ.. చరణ్ ”ఇప్పటికి సినిమాని చెక్కింది చాలు,… రీషూట్లేం చెప్పకండి..” అని చిరుని కోరడంతో… చిరు సినిమా చూసి ”గో ఎహెడ్ ప్రొసీడ్” అన్నారని వార్తలొచ్చాయి.
ఇదంతా నిజమే అనిపిస్తోంది రంగస్థలం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో స్పీచులు చూస్తుంటే.! ”కావాలంటే రీషూట్లు పెట్టుకోవొచ్చు.. మనకు టైమ్ ఉంది అన్నా.. నేను ఒప్పుకోలేదు. కరక్షన్ చెప్పడానికి ఏం కనిపించలేదు” అని చిరంజీవి స్వయంగా అన్నాడంటే.. ‘సుకుమార్ రీషూట్లపై’ ఓ కౌంటర్ వేసినట్టే. చరణ్ స్పీచులోనూ`రీషూట్` అనే మాట వినిపించింది. సినిమా త్వరగా పూర్తయినా, రీషూట్ల కోసమే సుకుమార్ ఎక్కువ టైమ్ తీసుకున్నాడని, సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా.. మార్చి 30న షిఫ్ట్ అవ్వడానికి కారణం కూడా… సుకుమార్ చెక్కుడు వ్యవహారమే అని చెప్పుకుంటున్నారు. సినిమా బాగుంటే.. ఈ రిపేర్లే ప్లస్ అవుతాయి. అప్పుడు రీషూట్ల గురించి ఎవ్వరూ మాట్లాడుకోరు. అదే తేడా కొడితే.. వేళ్లన్నీ సుకుమార్ వైపు చూపిస్తాయి. వాటిని ఎదుర్కోవడానికి కూడా సుక్కు సిద్ధంగా ఉండాలి మరి.