చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు దాదాపు అన్నీ హిట్టే. అందులో `దొంగ మొగుడు` ఒకటి. చిరంజీవి – రాధిక, చిరంజీవి – భాను ప్రియల జోడీ కనువిందు చేసిన సినిమా ఇది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. పాటలూ హిట్టే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతోంది. ఓటీటీ కోసం.
`నల్లంచు తెల్లచీర` అనే యండమూరి నవల ఆధారంగా తెరకెక్కినచిత్రం `దొంగమొగుడు`. నవలని సినిమాటిక్ గా మార్చడానికి చాలా ప్రయత్నాలు చేశారు అప్పట్లో. ఇప్పుడు ఇంకొన్ని మార్పులు చేర్పులూ చేసి.. `నల్లంచు తెల్లచీర`ని తెరకెక్కించబోతున్నారు. యండమూరి వీరేంద్రనాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. `స్టువర్టుపురం పోలీస్ స్టేషన్`తో.. యండమూరి దర్శకుడిగానూ మారిన సంగతి తెలిసిందే. అయితే.. దర్శకుడిగా యండమూరి తనదైన ముద్ర వేయలేకపోయాడు. సుదీర్ఘ విరామం తరవాత… మళ్లీ ఆయన మెగాఫోన్ పట్టబోతున్నాడు. ఓ హిట్ సినిమాని, ఓటీటీ కోసం రీమేక్ చేయడం ఇదే తొలిసారి. ఈ ప్రయత్నం విజయవంతమైతే, ఇలాంటి మరిన్ని సినిమాలు తెరపైకొచ్చే ఛాన్సుంది.