చిత్రసీమంతా ఇప్పుడు విజయ్ దేవరకొండ వెనుక నిలబడింది. `కిల్ ఫేక్ న్యూస్` పేరిట.. విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ ని ఏకం చేస్తున్నాయి. హీరోలంతా ముక్త కంఠంతా `కిల్ ఫేక్ న్యూస్` అని నినదిస్తున్నారు. ఓ గాసిప్ వెబ్ సైట్ పై విజయ్ దేవరకొండ ఓ వీడియో రూపంలో విరుచుకుపడ్డాడు. తన `మిడిల్ క్లాస్ ఫండ్` విషయంలో అర్థం పర్థం లేని వార్తలు రాసిన వెబ్ సైట్ పై విజయ్ పోరాటం ప్రకటించాడు. దాంతో విజయ్ వెనుక నిలబడాలని టాలీవుడ్ నిశ్చయించుకుంది. మహేష్ బాబు ఓ ట్వీట్ చేసి విజయ్ కి సంఘీభావం వ్యక్తం చేశాడు. అప్పటి నుంచీ.. విజయ్ మద్దతు పెరుగూనే ఉంది. ఇప్పుడు చిరంజీవి సైతం `నేను సైతం` అంటూ విజయ్ వెనుక నిలబడ్డాడు.
”డియర్ విజయ్.. మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. బాధ్యత లేని రాతల వల్ల నేనూ, నా కుటుంబం బాధ పడిన సందర్భాలు చాలా ఉన్నాయి” అంటూ తన సంఘీభావం వ్యక్తం చేశాడు చిరు. అభిప్రాయాల్ని వార్తలుగా ప్రచురించవద్దని జర్నలిస్టులకు హితవు పలికాడు చిరంజీవి. సీసీసీ ద్వారా చిరంజీవి విరాళాలు సేకరించి,కార్మికులకు నిత్యావసర వస్తువుల్ని అందించే కార్యక్రమం తలపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా సదరు వెబ్ సైట్ విషం చిమ్మే ప్రయత్నం చేసింది. ఇప్పుడు చిరు వ్యాఖ్యలు ఆ వార్తలకు సైతం సమాధానంగా నిలిచాయి.