విశాఖ ఉక్కు ఉద్యమానికి మెగాస్టార్ చిరంజీవి మద్దతు పలికారు. ఈ మేరకు ట్విట్టర్లో ప్రకటన చేశారు. ఆయన రాజకీయ అంశాలపై స్పందించి చాలా కాలం అయింది. సినీ పరిశ్రమ గురించి తప్ప ఇతర విషయాలు మాట్లాడటం లేదు. అందుకే విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి కూడా ఆయన స్పందిస్తారని ఎవరూ అనుకోలేదు. కానీ.. అనూహ్యంగా చిరంజీవి ఉక్కు పరిరక్షణ సమితి పోరాటానికి తన మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు. అయితే.. చిరంజీవి స్పందించడానికి కారణం కూడా ఉంది. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ 1960లలో ఎగసిన ఉద్యమంలో చిరంజీవి కూడా భాగం అయ్యారు. నర్సాపురంలో చిరంజీవి వైఎన్ఎం కాలేజీలో చదువుతున్న సమయంలో ఈ ఉద్యమం వచ్చింది.
ఆ సమయంలో చిరంజీవి కూడా స్వయంగా పెయింట్, బ్రష్ చేతబట్టి.. విశాఖ ఉక్కు నినాదాలను గోడలపై రాశారట. ఇదే విషయాన్ని చిరంజీవి తన ట్వీట్లో గుర్తు చేసుకున్నారు. విశాఖ ఉక్కు పోరాటంలో తనది కూడా పాత్ర ఉండటంతో అమ్మేస్తున్నారని తెలిసి చిరంజీవి భావోద్వేగానికి గురై.. ఇలా మద్దతు తెలిపి ఉంటారని భావిస్తున్నారు. క్యాప్టివ్ మైన్స్ కేటాయించకుండా.. నష్టాలొస్తున్నాయని అమ్మడం సమజసం కాదనేది చిరంజీవి వాదన. నిజానికి చిరంజీవి వయసులో ఉన్న తెలుగు వారందరికీ.. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఎగసి పడినప్పుడు యువకులుగా ఉన్న వారికి… స్టీల్ ప్లాంట్‌తో మానసిక బంధం ఉంటుంది. తాము కూడా పోరాడామని.. ఆ పోరాట ఫలితంగానే ఆ ప్లాంట్ వచ్చిందన్న సంతృప్తి ఉంటుంది.
ఇప్పుడు పోరాట ఫలాన్ని అమ్మేస్తున్నారని తెలిస్తే.. అందరూ బాధపడతారు. ఇప్పుడు చిరంజీవి పరిస్థితి కూడా అదే అంటున్నారు. అందుకే ఆయన స్పందించి.. మద్దతు తెలిపారని అంటున్నారు. ఈ విషయంలో రాజకీయాలు చేయడానికి ఏమీ లేదు .. విశాఖ ఉక్కు ఉద్యమకారునిగా చిరంజీవి ఆందోళనను గుర్తించాలి. అది సగటు ఆంధ్రుడి భావనగా కేంద్రం గుర్తిస్తే సమస్య పరిష్కారం అవుతుంది.
Visakha Steel Plant is a symbol of numerous sacrifices.Let's raise above parties and regions.
With a Steely resolve,
Let's save Visakha Steel plant! pic.twitter.com/jfY7UXYvim— Chiranjeevi Konidela (@KChiruTweets) March 10, 2021