చిత్రసీమలో ఆతిథ్యానికి మరో పేరులా నిలిచిన వ్యక్తి కృష్ణంరాజు. ఆయన స్వతహాగా భోజన ప్రియుడు. నాన్ వెజ్ లేనిదే ముద్దు దిగదు. అయితే ఒకట్రెండు రకాలతో సరిపెట్టుకోరు. అన్ని రకాలతో కంచం నిండుగా ఉండాల్సిందే. ఆతిధ్యం ఇచ్చేటప్పుడు కూడా అంతే. డైనింగ్ టేబుల్ పై కొంచెం కూడా ఖాళీ ఉండదు. తిండి పెట్టీ పెట్టీ చంపేస్తారు.. అంటూ కృష్ణంరాజు ఆతిథ్యం గురించి.. సరదాగా కంప్లైంట్ చేస్తుంటారంతా. అందుకే కృష్ణంరాజు గారి నుంచి ఆహ్వానం వస్తే.. ఇక ఆ రోజు పండగే. వంటకాలన్నీ దగ్గరుండి సిద్దం చేసి, పక్కన నిలబడి మరీ వడ్డించడం ఆయనకు అలవాటు. కృష్ణంరాజు ఎంత భోజనప్రియుడైనా.. కారెజీ ఇంటి నుంచి రావాల్సిందే. బయట ఆహారం అస్సలు తీసుకోరు. కృష్ణంరాజు సెట్‌కి ఓ భారీ కారియర్ రావడం ఆనవాయితీ. లంచ్ సమయంలో అందరినీ పక్కన కూర్చోబెట్టుకొని… ఆ కారియర్ని పంచుకొని తినేవారు. పులస కూరంటే.. కృష్ణంరాజుకి చాలా ఇష్టం. భోళా శంకరుడు అంటారే… కృష్ణంరాజు అలాంటివాడే. ఎవరైనా సరే. ఆయన్ని మాటలతో పడగొట్టేయొచ్చు. ఎవరేం అడిగినా కాదనని వ్యక్తి. కృష్ణంరాజుకి ఫొటోగ్రఫీ హాబీ. ఖరీదైన కెమెరాల్ని కొనేవారు. ఓసారి… చిరంజీవి పుట్టిన రోజుకు ఆయన మెడలో కెమెరా వేసుకొని వెళ్లారు. చిరంజీవి ఫొటోల్ని తీయడానికి. కృష్ణంరాజు ఫొటోలు తీస్తున్నప్పుడు ఆ కెమెరాని చూసిన చిరంజీవి.. `అన్నయ్య.. ఈ కెమెరా ఎక్కడది.. బాగుందే` అన్నార్ట. అంతే.. వెంటనే ఆ కెమెరాని.. చిరంజీవి మెడలో వేసి `ఇదే నీ బర్త్ డే గిఫ్ట్` అనేశారు. అప్పట్లోనే ఆ కెమెరా ఖరీదు లక్షల్లో ఉండేది.
ఈ అలవాట్లన్నీ అచ్చంగా అందిపుచ్చుకొన్నాడు ప్రభాస్. అప్పట్టో కృష్ణంరాజు గురించి ఎలా చెప్పుకొన్నారో, ఇప్పుడు ప్రభాస్ గురించి అలా మాట్లాడుకొంటున్నారు.