‘ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్’ అని చిరంజీవి చెప్పుకొన్న సినిమా ‘సైరా’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సినిమా ఇది. 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కథపై ఇష్టంతో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించారు. అప్పట్లో ఈ సినిమా ఫ్లాప్. నిర్మాతగా చరణ్ కు నష్టాలు మిగిల్చింది. చిరు కష్టపడినా ఫలితం రాకుండా పోయింది.
అయితే ఇప్పుడీ చిత్రాన్ని బయటకు తీస్తున్నారు కొంతమంది ఫ్యాన్స్. ‘ఇంత మంచి సినిమాని అప్పట్లో ప్రేక్షకులు ఎలా మిస్ చేశారు’ అంటూ సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. దానికీ కారణం ఉంది. ఇటీవల బాలీవుడ్ లో ‘చావా’ విడుదలై మంచి విజయాన్ని అందుకొన్న సంగతి తెలిసిందే. దేశభక్తిని రగిలించిన చిత్రమిది. వసూళ్లు భారీగా వస్తున్నాయి. దర్శకుడికీ, హీరోగా నటించిన విక్కీ కౌశల్ కి మంచి పేరొచ్చింది. ‘ఇలాంటి సినిమానే కదా, తెలుగులో చిరంజీవి చేసింది. అప్పుడు ఎందుకు గుర్తించలేకపోయారు’ అంటూ సినిమా ప్రేమికులు ‘సైరా’ని గుర్తు చేసుకొంటున్నారు. ‘సైరా’ క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా సాగుతుంది. దాన్ని సురేందర్ రెడ్డి బాగా పిక్చరైజ్ చేశారు కూడా. ‘చావా’లోనూ ఇలాంటి బరువైన క్లైమాక్స్ ఉంది. దీంతో `సైరా` క్లైమాక్స్నీ ‘చావా’ క్లైమాక్స్ నీ ముడి పెడుతున్నారు. ‘తెలుగులో మంచి సినిమాలు తీస్తే గుర్తించరు కానీ… పక్క భాష వాళ్లు చేస్తే మెచ్చుకొంటారు’ అని నొసలు చిట్లిస్తున్నారు. ఇప్పుడు ఎంత అనుకొన్నా ఏం లాభం? ‘సైరా’ కష్టాన్నీ, అందులోని ఎమోషన్నీ అప్పట్లో గుర్తించలేకపోయారు. ఇప్పుడు పైకి లేపినా ప్రయోజనం లేదు.