డబ్బింగ్ చెప్పుకోవడం కూడా ఓ కళే. కెమెరా ముందు ఎంత కష్టపడాలో.. డబ్బింగ్ థియేటర్లోనూ అంతే కష్టం ఉంటుంది. సీన్ ఎమోషన్ని అర్థం చేసుకుని, సెట్లో ఏ టెంపోలో డైలాగ్ చెప్పారో అదే టెంపోలో డైలాగ్ చెప్పుకుంటూ వెళ్లాలి. అందుకే డబ్బింగ్ అంత ఈజీ కాదు. ఒక్కోసారి వారం, పది రోజులు డబ్బింగ్ థియేటర్లోనే గడపాల్సివస్తుంది. అయితే చిరు మాత్రం `సైరా` డబ్బింగ్‌ని కేవలం 20 గంటల్లోనే పూర్తి చేశారు.
చిరంజీవి 151వ చిత్రం ‘సైరా’. ఇటీవలే షూటింగ్ పూర్తయ్యింది. ఆ వెంటనే డబ్బింగ్ కూడా మొదలెట్టేశారు. చిరు తన 152వ సినిమాని వచ్చే వారమే మొదలెట్టేయాలి. అందుకే.. `సైరా` డబ్బింగ్‌ని వీలైనంత త్వరగా పూర్తి చేద్దామని ఫిక్స్ అయ్యారు. కేవలం 20 గంటల్లోనే తన డబ్బింగ్ పనిని పూర్తి చేశారు చిరు. నిజానికి ఇందులో డైలాగ్ పార్ట్ చాలా ఎక్కువ. కొన్ని సన్నివేశాల్లో పేజీల కొద్దీ డైలాగులు పలకాల్సివచ్చిందట. అయితే చిరు మాత్రం తన అనుభవాన్నంత రంగరించి డబ్బింగ్‌ని అతి తక్కువ సమయంలోనే ముగించారు. దటీజ్ చిరు.