చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ కొన్ని రోజుల పాటు షూటింగ్ జరుపుకుని ఆగిపోయిన సంగతి తెలిసిందే. తీసిన పది రోజుల సన్నివేశాల్ని పక్కన పెట్టేసినట్టు వార్తలొచ్చాయి. అయితే అందులోని కొన్ని షాట్లు మాత్రం.. అలానే ఉంచేస్తారని తెలుస్తోంది. ఆ పదిరోజుల అవుట్ పుట్లో కొన్ని షాట్లు అద్భుతంగా వచ్చాయని.. వాటిని మాత్రం సినిమాలో చూడొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. చిరంజీవి గుర్రంపై వస్తూ.. రెండు చెట్ల మధ్య నుంచి జంప్ చేసే షాట్ ఒకటి ఆమధ్య షూట్ చేశారు. ఆ షాట్.. చాలా బాగా వచ్చిందని, చిరు డూప్ లేకుండా.. రిస్క్ తీసుకుని మరీ ఆ సన్నివేశంలో నటించారని, అందుకే మిగిలిన షాట్లు పక్కన పెట్టినా.. అది మాత్రం అలానే ఉంచేస్తారని తెలుస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే ‘సైరా’లో చిరంజీవి ఎంట్రీ సన్నివేశం అదే కావొచ్చు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి చరణ్ నిర్మాత. రెండో షెడ్యూలు త్వరలో మొదలు కాబోతోంది. ఇందుకోసం హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకమైన సెట్స్‌ని రూపొందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో కాస్ట్యూమ్స్‌కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అక్కడే… ఆయుధాలూ సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ షెడ్యూల్ ఎప్పటి నుంచి అన్నది క్లారిటీ రావాల్సివుంది.