చిరంజీవి… నాలుగు దశాబ్దాల ప్రయాణం ఆయనది. తెలుగు సినిమా స్థాయికి ప్రపంచానికి తెలిపిన ఘనత. ఎన్నో ఎత్తు పల్లాలు చవిచూశారు. మెగాస్టార్ అయ్యారు. మూడు దశాబ్దాల పాటు… బాక్సాఫీసుని ఏలారు. అలాంటి చిరంజీవి ఇప్పటికీ మీడియాకు భయపడిపోవడం.. ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ… ఇది నిజం. ఈ విషయం ఆయనే ఒప్పుకొన్నారు. గాడ్ ఫాదర్ విడుదలకు ముందు.. మీడియాలో వచ్చిన రాతలు ఆయన్ని కంగారు పెట్టినట్టు మీడియా ముందే చెప్పేశారు. మీడియాకి భయపడే… ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వర్షం పడినా… ఆ వర్షంలో తడుస్తూనే సుదీర్ఘంగా ప్రసంగించారు. ఇదంతా మీడియాకు భయపడే. ”వర్షంతో ప్రీ రిలీజ్ ఫంక్షన్ రసాభస అయ్యింది రాసి మీడియా కంపు చేస్తుందన్న భయంతో మాట్లాడాల్సివచ్చింది” అని అసలు నిజాన్ని ఒప్పుకొన్నారు మెగాస్టార్. సినిమాకి పబ్లిసిటీ చేయడం లేదని, హైప్ లేదని, మార్కెట్ జరగడం లేదని…. వార్తలు రావడం ఆయన్ని తీవ్రంగా కలచివేసింది. అందుకే `మేం ఎప్పుడు ఏం చేయాలో.. మీరే చెబుతారా? మాకు ఆమాత్రం తెలీదా` అంటూ మీడియాపై డైరెక్ట్ ఎటాక్ చేసేశారు. కాకపోతే… అక్కడే కాస్త సంయమనం పాటిస్తూ… సినిమా విడుదలైన తరవాత.. వచ్చిన పాజిటీవ్ రివ్యూలకు థ్యాంక్స్ చెప్పారు. మళ్లీ మీడియాని కాస్త లేపే ప్రయత్నం చేశారు.
ఇంత అనుభవం సంపాదించిన తరవాత కూడా చిరు మీడియా పట్ల అప్రమత్తంగా ఉండడం ఆశ్చర్యమే. ఎందుకంటే ఈ తరం అస్సలు మీడియా రాతల్ని పట్టించుకోవడమే లేదు.తమపై నెగిటీవ్ వార్తలు వస్తున్నా.. లెక్క చేయడం లేదు. కథానాయికలపై, వారి ప్రేమ వ్యవహారాలపై ఇటీవల చాలా వార్తలు వచ్చాయి. అయితే ఏ కథానాయికా స్పందించలేదు. సమాధానం చెప్పే ప్రయత్నమూ చేయలేదు. కానీ చిరు వేరు. ఆయన దగ్గర ప్రతీ దానికీ ఓ లెక్క ఉంటుంది. అసలే… `ఆచార్య` ఫ్లాప్ తో.. ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. నిజానికి ‘గాడ్ ఫాదర్’ విషయంలోనూ ఆయనకు కంగారు ఉంది. ఎందుకంటే.. ఇది అసలే రీమేక్. ఇందులో చిరు అభిమానులకు నచ్చే పాటలకు స్కోప్ లేదు, రొమాన్స్ లేదు. ఎంత బాగా చేసినా లూసీఫర్తో.. పోల్చి చూస్తారు. అందుకే.. సినిమా విడుదలకు ముందు చిరు పెద్దగా మాట్లాడలేదు. ‘ఓ నిశబ్ద విస్పోటనంలా వస్తాం’ అని చెప్పారు. ఇంత లో ప్రొఫైల్ లో సినిమా వస్తున్నప్పుడు మీడియాలో ఇలాంటి వార్తలు రావడం కూడా సహజమే. దాంతో చిరులో కంగారు మరింత పెరిగింది. కాకపోతే.. ఈ సినిమా వర్కవుట్ అవ్వడంతో.. చిరు రిలాక్స్ అయ్యారు. అందుకే సక్సెస్ మీట్ లో మీడియాపై తనకున్న అసహనాన్ని బయటపెట్టేశారు.