మెగాస్టార్ చిరంజీవి కరోనా వైరస్ సోకలేదు. ఆచార్య షూటింగ్ కోసం ఆయన చేయించుకున్న టెస్టులో లోపం ఉండటంతో ఆయనకు పాజిటివ్ అని రిజల్ట్ వచ్చింది. దాన్నే నిజం అనుకుని.. చిరంజీవి హోం క్వారంటైన్‌కు వెళ్లారు. అయితే.. ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో.. ఎందుకైనా మంచిదని.. వైద్యుల బృందం సలహాలు తీసుకుని మరో మూడు చోట్ల టెస్టులు చేయించుకున్నారు. అన్ని చోట్లా నెగెటివ్ అనే వచ్చింది. దాంతో వైద్యులు కరోనా టెస్ట్ కిట్లోపంతోనే నిర్ధారించారు.
తనకు ఎక్కడైతే పాజిటివ్ వచ్చిన టెస్ట్ చేశారో.. అక్కడే మళ్లీ టెస్ట్ చేయించుకున్నారు. అక్కడ కూడా నెగెటివ్ వచ్చింది. దాంతో.. అసలు చిరంజీవికి కరోనా సోకలేదని స్పష్టయింది. ఆచార్య షూటింగ్ ప్రారంభించేముందు నిబంధనల ప్రకారం చేయించుకున్న టెస్టు కారణంగా.,.. చిరంజీవి కుటుంబమే కాదు.. అభిమానులు.. ఆయనను కలిసిన వారు.. ఆందోళనకు గురయ్యారు. చిరంజీవికి పాజిటివ్ రిజల్ట్ రావడానికి రెండు రోజుల ముందే.. సీఎం కేసీఆర్ ను కలవడం కూడా.. కలకలం రేపింది.
చిరుతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్న నాగార్జున లాంటి వాళ్లు వెంటనే టెస్ట్ చేయించుకున్నారు. వారికి నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ ఐసోలేషన్‌కు వెళ్లేందుకు కొంత మంది సిద్ధమయ్యారు. రెండు రోజుల నుంచి సినీ ప్రముఖులు చిరంజీవి త్వరగా కోలుకోవాలని ట్వీట్లు పెడుతున్నారు. చిరంజీవికి కరోనా సోకలేదని తేలినా.. కరోనా టెస్ట్ కిట్ల ప్రామాణికతపై మరో సారి సందేహాలు తలెత్తాయి. ఒకటికి మూడు సార్లు టెస్టులు చేయించుకుంటే తప్ప… కరోనా నిర్ధారణ కాదేమో అన్న సైటైర్లు పడుతున్నాయి.