మెగాస్టార్ చిరంజీవి.. రాజకీయాల్లో ఉన్నారో లేరో ఎవ్వరికీ తెలీదు. ఉన్నా లేనట్టే… లేకున్నా ఉన్నట్టుగానే ఉంది కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉనికి! పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనరు. చంద్రబాబు సర్కారును విమర్శస్తూ ఎక్కడా ఎలాంటి కామెంట్లూ చెయ్యరు. రాష్ట్రంలో జీర్ణావస్థలో ఉన్న పార్టీ గురించి ఆయనకు ఏమాత్రం అక్కర్లేదు. చిరంజీవిపై ఇలాంటి విమర్శలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ.. ఓ టీవీ షో నడిపించుకుంటూ కాలం నెట్టుకొచ్చేస్తున్నారు. అయితే, కాంగ్రెస్ గురించి చిరంజీవి ఆలోచించకపోయినా… చిరంజీవి గురించి కాంగ్రెస్ ఆలోచిస్తోందని సమాచారం. ఏఐసీసీలో మెగాస్టార్ టాపిక్ తాజాగా వచ్చిందట! ఆయన సేవల్ని రాష్ట్రంలో ఏ విధంగా వినియోగించుకోవచ్చు అనే అంశమై ఓ ఆసక్తికరమైన చర్చ జరిగిందట!
రాష్ట్ర విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకమైపోయింది. టీడీపీ, వైకాపాలు అధికార ప్రతిపక్షాలుగా ఉన్నాయి. కాంగ్రెస్ పాత్ర ఏంటనేది ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు. విభజన అనంతరం పార్టీని పునరుద్ధరించేందుకు రాష్ట్ర స్థాయిలో చొరవ చూపిన నేతలూ లేరు. ఈ నేతల్లో చిరంజీవి కూడా ఉన్నారని గుర్తు చేసుకోవాలి. అయితే, ఆయన పార్టీకి అందుబాటులో ఉండటం లేదంటూ ఇటీవలే కొంతమంది నేతలు ఏఐసీసీ దగ్గర మొరపెట్టుకుంటే… లేదు లేదు, చిరంజీవి యాక్టివ్ గానే ఉన్నారంటూ దిగ్విజయ్ సింగ్ వెనకేసుకుని వచ్చారట.
ఈ సందర్భంలోనే వచ్చే ఎన్నికల్లో చిరంజీవిని పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే ఎలా ఉంటుందీ అనే ప్రతిపాదన ఏఐసీసీలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. గోదావరి జిల్లాలకు చెందిన కొంతమంది నాయకులు కూడా ఈ ప్రతిపాదనను బలపరచారట! అన్ని వర్గాలనూ కలుపుకుంటూ, కొత్త ఊపు తెచ్చే ఫేస్ పార్టీకి అవసరమనీ, చిరంజీవి తెరమీదికి వస్తే పార్టీకి ప్లస్ అవుతుందని కొంతమంది అభిప్రాపడ్డారట. కాబట్టి, చిరంజీవిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే బాగుంటుందని అన్నారట.
ప్రస్తుతం కమిట్ అవుతున్న సినిమాలు త్వరగా పూర్తి చేసుకోవాలంటూ చిరంజీవికి ఏఐసీసీ సూచించిందనే ఓ వార్త కూడా వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే… ఏపీ కాంగ్రెస్ భవిష్యత్తు మరింత చిక్కుల్లో పడుతుందన్న అభిప్రాయమూ వ్యక్తమౌతోంది. ఎందుకంటే, రాజకీయ నాయకుడిగా చిరంజీవి ట్రాక్ రికార్డ్ ఓపెన్ సీక్రెట్. పైగా, రాజకీయాల కంటే సినిమాలే బాగున్నాయంటూ అయిష్టంలో వెళ్లిపోయారు. అలాంటి మెగాస్టార్ ను మళ్లీ బలవంతంగా వెనక్కి తీసుకుని రావడం ఎంతవరకూ కరెక్ట్..? పైగా, ఇంకోపక్క సోదరుడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. అన్నదమ్ములం ఎప్పుడూ ఒకటే అంటూ అడపాదడపా ప్రకటనలూ చేస్తుంటారు. ఏదేమైనా, పాలిటిక్స్ లోకి మెగా రీ ఎంట్రీ ఉంటే పరిస్థితి మరింత ఉత్కంఠ భరితం అవుతుందనడంలో సందేహం లేదు