మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోని అంతర్గత విబేధాల్ని సరిదిద్దడానికి చిరంజీవి రంగంలోకి దిగారు. ఇప్పటికే ఆయన రాజశేఖర్, నరేష్ వర్గీయులతో ఓసారి మాట్లాడినట్టు తెలుస్తోంది. అమెరికా నుంచి తిరిగొచ్చాక ‘మా’లోకి కీలక సభ్యులందరితోనూ ఓ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారని, ఆ మీటింగ్‌లోని ‘మా’ సభ్యులకు చిరు దిశానిర్దేశం చేయబోతున్నారని సమాచారం.
నరేష్‌ని పదివీ కాలం ముగియకముందే పదవి నుంచి దించేసి, తాజాగా ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదన నడుస్తోంది. అయితే చిరంజీవి దానికి ఒప్పుకోలేదట. ఆయన ప్రస్తుతం నరేష్ వైపే ఉన్నారని తెలుస్తోంది. రాజశేఖర్ వ్యవహార శైలి చిరంజీవిని చాలా సందర్భాల్లో ఇరుకున పెట్టింది. చిరు అభిమానులు సైతం రాజశేఖర్ మాటలు, ప్రవర్తనపై గుర్రుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజశేఖర్ కి చిరు మద్దతు ఇస్తాడనుకోవడం తెలివితక్కువ తనమే. మా ఎన్నికలలో నాగబాబు సహాయం తీసుకున్న రాజశేఖర్, గెలిచాక మాత్రం నాగబాబు నుంచి వల్ల ఒక్క ఓటు కూడా తమకు పడలేదని బాహాటంగానే చెప్పడం గుర్తుండే ఉంటుంది. ఇలాంటి ప్రవర్తనే మెగా మద్దతుని తమ నుంచి దూరం చేసింది. వీలైనంత త్వరగా ఈ గొడవలన్నీ సర్దుబాటు చేయాలని చిరు భావిస్తున్నారు. మోహన్‌బాబు, కృష్ణంరాజులాంటి సినీ పెద్దలు కూడా నరేష్ వైపే ఉన్నారని, నరేష్ పదవికి ఎలాంటి ఢోకా లేదని `మా` వర్గాలు చెబుతున్నాయి.