హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ, నటుడు చిరంజీవి భారతీయ జనతాపార్టీలో చేరబోతున్నట్లు హైదరాబాద్‌నుంచి వెలువడే ఒక ఆంగ్ల దినపత్రిక ఇవాళ ఓ కథనాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి ప్రవర్తనతో నొచ్చుకుని చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. ఆ కథనం ప్రకారం… ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని తాను పునరుజ్జీవింప చేయటానికి ప్రయత్నిస్తుండగా, చిరంజీవి ఆ దిశగా పనిచేయకుండా, 150వ సినిమాపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు రాహుల్ భావిస్తున్నారు. అందుకే చిరుపై రాహుల్ కోపంగా ఉన్నారు. 150వ సినిమా చేయొద్దని సూచించారు. సినిమాలపై కాకుండా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటంపై దృష్టి పెట్టాలని చెప్పారు. కేంద్రమంత్రి పదవి ఇచ్చి జాతీయస్థాయిని కల్పించినందుకు పార్టీ రుణం తీర్చుకోవాలని అన్నారు. దీనిపై చిరంజీవి నొచ్చుకుని తన సన్నిహితులవద్ద రాహుల్ వ్యాఖ్యలపై వాపోయారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుదామని యోచిస్తున్నారు. ఇది తెలుసుకున్న బీజేపీ నేతలు చిరంజీవిని తమ పార్టీలోకి తీసుకోవటానికి ప్రయత్నాలు ప్రారంభించారు. చిరంజీవికూడా బీజేపీలోకి వెళదామని నిర్ణయించుకున్నారు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎలాగూ మిత్రపక్షంగా ఉన్నందున, ఇప్పుడు చిరంజీవి చేరితే తమ పార్టీ ఏపీలో గణనీయమైన శక్తిగా ఎదుగుతుందని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు.
ఆంగ్ల దినపత్రిక కథనంలో వాస్తవం ఎంత ఉందోగానీ అది నిజమైతేమాత్రం బీజేపీకి వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లే. 2019 ఎన్నికలనాటికి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు దీటుగా ఒక సమాంతరశక్తిగా ఎదగాలని పార్టీ అధ్యక్షుడు అమిత్షాతోబాటు ఆ రాష్ట్రంలోని పలువురు బీజేపీ నేతలు ఆశిస్తున్నారు. టీడీపీ కమ్మ పార్టీగా, వైసీపీ రెడ్డి పార్టీగా ముద్రపడిపోయి ఉన్నందున, గణనీయమైన సంఖ్యలో ఉన్న కాపు సామాజికవర్గంనుంచి గట్టి నాయకుడెవరికైనా నాయకత్వాన్ని ఇచ్చి తద్వారా ఆ సామాజికవర్గాన్ని పార్టీలోకి తీసుకురావాలని బీజేపీ నేతలు కొంతకాలంగా యోచిస్తున్నారు. కాపు సామాజికవర్గానికే చెందిన సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణలలో ఎవరికైనా పార్టీ రాష్ట్ర పగ్గాలు ఇవ్వాలని అనుకుంటున్నారుకూడా. ఇప్పుడు చిరంజీవి కనక బీజేపీలోకి చేరితే అటు గ్లామర్, ఇటు క్యాస్ట్ కార్డ్ రెండూ కలిసొస్తాయి కనుక ఆ పార్టీ నాయకులు ఏదైతే ఆశించారో ఖచ్చితంగా అదే జరిగినట్లవుతుంది. అదే జరిగితే 2019 ఎన్నికలలో చిరును బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయటం ఖాయం. దరిమిలా బాబు-జగన్-చిరు మధ్య ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుందన్నమాట.
కొసమెరుపు: ఇవాళ ఆంగ్ల దినపత్రికలో చిరుపై కథనాన్ని ఇచ్చిన నాగేంద్ర కుమార్ గతంలో ఫిల్మ్ జర్నలిస్ట్‌గా ఉన్నారు. ఆయన చాలాకాలం చిరంజీవికి పీఆర్ఓగాకూడా చేసిఉండటం విశేషం.