చిరంజీవి ప్రస్తుతం `ఆచార్య`తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆచార్య అవ్వగానే… `లూసీఫర్` రీమేక్ ని పట్టాలెక్కిస్తారు. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు. `లూసీఫర్`లో మలయాళ ఫ్లేవర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఉన్నది ఉన్నట్టుగా తీస్తే – తెలుగు జనాలకు నచ్చదు. అందుకే కథలో కీలకమైన మార్పులు చేశారు.. చేస్తున్నారు. మాతృకలో మోహన్ లాల్ పక్కన కథానాయిక లేదు. తెలుగులో చిరంజీవి ఇమేజ్ దృష్టిలో ఉంచుకుని, ఈ సినిమాలో కథానాయిక పాత్రని కల్పించారని ప్రచారం జరుగుతోంది. అయితే నిజానికి ఈ సినిమాలోనూ హీరోయిన్ లేదట. చిరు కోసం హీరోయిన్ ని రంగంలోకి దించాలని మోహన్ రాజా భావించినా.. `నాకు హీరోయిన్ వద్దు… ఈ విషయంలో మాతృకని ఫాలో అయిపోదాం` అని చిరంజీవి మోహన్ రాజాకు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. చిరు… సినిమాలో హీరోయిన్ లేకపోవడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. `లూసీఫర్` లెక్కల ప్రకారం చూస్తే, మరో హీరో పాత్రకూ ఛాన్సుంది. కానీ.. ఆ పాత్రని పూర్తిగా పక్కన పెట్టేశారని, కేవలం చిరంజీవిపైనే కథంతా నడిపేశారని తెలుస్తోంది. లక్ష్మీభూపాల ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు. స్క్రిప్టు వర్క్ దాదాపుగా పూర్తయ్యింది. ఏప్రిల్ రెండో వారంలో ఈ సినిమా పట్టాలెక్కబోతోందని సమాచారం