టాలీవుడ్ సమస్యలు పరిష్కరించేందుకు .. వారి సమస్యలేమిటో తెలుసుకోవాలని సీఎం జగన్ సంకల్పించారు. నెలాఖరులో సమావేశం ఉంటుందని అనుకున్నా సాధ్యపడలేదు. దీంతో ఈ మొదటి వారంలనోనే వారికి సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. నాలుగో తేదీన వారిని తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు రావాల్సిందిగా పిలుపులు అందినట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్‌తో సమాన్వయం చేసుకునే బాధ్యతల్ని సమాచార మంత్రి పేర్ని నాని తీసుకున్నారు. ఇప్పటికే ఆయన ఓ సారి హైదరాబాద్ వెళ్లి .. చిరంజీవితో సమావేశం అయి వచ్చారు. చిరంజీవి కూడా టాలీవుడ్‌లోని వివిధ రకాల వ్యాపార వర్గాల ప్రముఖులతో ఓ సారి సమావేశం అయ్యారు.
సీఎం జగన్‌తో ఏ ఏ అంశాలపై చర్చించాలన్నదానిపై క్లారిటీ తీసుకున్నారు. ఇతర చిన్నా చితకా సమస్యలు ఉన్నా… సినీ పరిశ్రమకు ఒకే ఒక్క పెద్ద సమస్య గా ఉంది టిక్కెట్ రేట్లు మాత్రమే. అదీ కూడా ఏపీ ప్రభుత్వం సృష్టించిదే. వకీల్ సాబ్ సిని్మా సమయంలో ప్రేక్షకుల్ని దోచుకుంటున్నారని ఆరోపించిన ప్రభుత్వం టిక్కెట్ రేట్లను పూర్తిగా తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రేట్లకు ధియేటర్లకూ గిట్టుబాటు కాదు ఇటు నిర్మాతలకూ ఉపయోగం ఉండదు. అందుకే పెద్ద సినిమాలు సినిమాల విడుదల విషయంలో ఆలోచనలు చేస్తున్నాయి. ఇప్పుడీ సమస్యను జగన్ వద్ద పరిష్కరించుకోవాల్సి ఉంది.
కరోనా కారణంగా సినీ పరిశ్రమకు జగన్ ప్రకటించిన ప్యాకేజీ కూడా ఇంత వరకూ అందలేదు. దీనిపైనా చిరు టీం చర్చించే అవకాశం ఉంది. అక్టోబరులో పెద్ద సినిమాల విడుదలకు రంగం సిద్దమవుతోంది. అందువల్ల ఈలోపు చర్చలు పూర్తి చేసి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను సిద్ధం చేయించాలన్న యోచనలో సినీ పెద్దలు ఉన్నారు. సీఎం జగన్ సమస్యల పరిష్కారానికి చూపే స్పందనను బట్టి ఏపీలో పూర్తి స్థాయిలో థియేటర్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.