కాంగ్రెస్ పార్టీ నేత చిరంజీవి… రాజకీయాల్లో చివరి సారి ఎప్పుడు కనిపించారు..?. ఎవరికీ గుర్తు లేదు. పోనీ.. రాజ్యసభ సభ్యుడిగా.. చివరిగా ఎప్పుడు రాజ్యసభకు హాజరయ్యారు.. ? ఎవరికీ తెలియదు. చివరికి తమ్ముడు పార్టీ పెట్టారని.. ఫ్యాన్స్ అందర్నీ అధికారికంగా ఓ కార్యక్రమం పెట్టి మరీ అందులో చేర్పించేశారు. అదే తమ్ముడితో ఇక అన్నయ్య రాజకీయాల్లోకి రారు అని ఇంగ్లిష్ మీడియాకు ఇంటర్యూలు ఇప్పించారు. చివరికి మొన్నటికి మొన్న… కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోలేదని… చిరంజీవి ఇక కాంగ్రెస్ సభ్యుడు కాదని.. పీఆర్వోలతో.. మీడియాకు లీకులిప్పించారు. ఇన్ని జరిగిన తర్వాత చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారని కానీ… కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని కానీ ఎవరైనా అనుకుంటారా..?
చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని.. ఎన్నికలకు రెండు నెలల ముందు వచ్చి ప్రచారం చేస్తారని.. రఘువీరారెడ్డి లాంటి నేతలు.. అప్పుడప్పుడు తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ ఉంటారు. కర్ణాటక ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ లిస్టులో… పేరు పెట్టినా… రాహుల్ గాంధీ ఫోన్ చేసి అడిగినా.. స్పందించలేదు. ఎన్నికల సమయంలో … పార్టీలో యాక్టివ్ కావాలని… రాహుల్ గాంధీ దూతల్ని పంపి అడిగించినా ..నో రెస్పాన్స్. చివరికి ఇక చిరంజీవి మనకు లేడు అనుకుంటున్న సమయంలో… ఇప్పుడు మీడియాకు… చిరంజీవి క్యాంప్.. ఓ లీక్ అందజేసింది. అదేమిటంటే… కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి రాజీనామా చేయబోతున్నారని. ఆశ్చర్యపోవాల్సిన పని లేకుండా.. కొంత క్లారిటీ కూడా ఇచ్చారు. ఎందుకంటే… తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపినందుకు… చిరంజీవి బాధపడుతున్నారట. రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చిన కాంగ్రెస్ పార్టీపై కోపం వచ్చిందట. అందుకే.. ఈ అసంతృప్తిని లేఖ రూపంలో వెల్లడించి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలనుకుంటున్నారట..!
ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఆందోళన చెందేది ఏమీ లేదు. ఎందుకంటే.. చిరంజీవి అనే క్యాండేట్ … తమ పార్టీలో ఉన్న సంగతిని వాళ్లు మర్చిపోయారు. ఉన్న కొద్ది మంది.. ఎన్నికల సీజన్లో ఎక్కడ మంచి బేరం వస్తుందో అక్కడకు వెదుక్కుని వెళ్లిపోతున్నారు. చిరంజీవి లేఖ రాయడం వల్ల… అటు కాంగ్రెస్కు.. ఇటు టీడీపీకి వచ్చేదేమీ ఉండదు. పోయేది కూడా ఉండదు. కానీ చిరంజీవి ఇమేజ్ కే కొత్తగా మరో డ్యామేజీ వస్తుంది. రాజకీయాల్ని వదిలేసుకుని సినిమాలు చేసుకుంటూ.. ఇప్పుడు కొత్తగా… టీడీపీతో కలిశారంటూ… బయటకు వచ్చి రచ్చ చేస్తే… కొత్తగా ట్రోలింగ్స్ తెచ్చి పెట్టుకోవడం తప్ప సాధించేదేమీ ఉండదు. ఇప్పుడు ఉన్నట్లు ఉండిపోతే… చిరంజీవి అంతేలే అనుకుంటారు.. కానీ రాజకీయాల్లో మళ్లీ వేలు పెడితే.. ఉన్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందంటున్నారు ఫ్యాన్స్.