ఇటీవల చిరంజీవి అనారోగ్యానికి గురయ్యారు. చికెన్ గున్యా తో ఆయన కొంత ఇబ్బంది పడ్డారు. అయితే అదే సమయంలో ‘విశ్వంభర’ సినిమా లో కొన్ని సన్నివేశాల్ని పూర్తి చేయాల్సివచ్చింది. సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయాలన్న ఉద్దేశ్యంతో ఆయన అంత ఇబ్బందిలోనూ షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ తరవాత సినిమా విడుదల వాయిదా పడిందనుకోండి. అది వేరే విషయం. గిన్నిస్ బుక్ అవార్డు స్వీకరించడానికి వచ్చినప్పుడు, ‘సైమా’ అవార్డు కార్యక్రమానికి వెళ్లినప్పుడు కూడా ఆయన కాళ్ల నొప్పితో బాధ పడుతూనే ఉన్నారు. ఇప్పుడు చిరు ఆరోగ్యం మెల్లమెల్లగా కుదుట పడుతోంది. ‘విశ్వంభర’ ఎలాగూ వాయిదా పడింది. మే 9న విడుదల చేస్తారు. కేవలం రెండు పాటలు షూట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి.. ‘విశ్వంభర’కు సంబంధించిన షూటింగ్ ఒత్తిడి ఆయనపై ఏం లేదు.
అందుకే చిరు పూర్తిగా విశ్రాంతి మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఆయన ఇప్పుడు కొత్త కథలు కూడా వినడం లేదని టాక్. ఆల్రెడీ కొన్ని కథల్ని సెలెక్ట్ చేసి పక్కన పెట్టేశారు. ‘విశ్వంభర’ తరవాత ఏ సినిమా చేయాలి? అనే విషయంలో చిరు ఓ స్పష్టతకు వచ్చేశారు. కాబట్టి తదుపరి సినిమా విషయంలోనూ ఆయనకు ఒత్తిడి లేదు. సంక్రాంతి వరకూ చిరు షూటింగుల్లో పాలు పంచుకొనే పరిస్థితి కనిపించడం లేదు. సంక్రాంతి తరవాత కొత్త సినిమా ప్రకటించే అవకాశం ఉంది. ‘గాడ్ ఫాదర్’ దర్శకుడు మోహన్ రాజా, హరీష్ శంకర్ చిరుకి కథలు వినిపించారు. ఆ రెండు కథలూ చిరుకి బాగా నచ్చాయి. ప్రస్తుతం ఈ కథకుల సంబంధించిన పనులు జరుగుతున్నాయి.