చిరంజీవి.. ఓ అల్టీమేట్ ఎంటర్ట్రైనర్. వెండితెర హీరోయిజంకు కేరాఫ్ అడ్రస్. డ్యాన్సులు, ఫైట్లు, డైలాగులు.. ఒక్కటేమిటి.. తెలుగు సినిమా గమనాన్ని మార్చిన ట్రెండ్ సెట్టర్. తెలుగు సినిమా సైజ్ ను ఒక్కసారిగా పదిరెట్లు పెంచిన స్టార్. మహా నటుడు ఎన్టీఆర్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో. ఒకప్పుడు తెరపై ఎన్టీఆర్ కనిపిస్తే థియేటర్లో నోట్ల వర్షం కురిసేది. ఆ తర్వాత చిరంజీవికి మాత్రమే అతంటి ఫాలోయింగ్ దక్కింది. అయితే చరిష్మా అంతా ఓవర్ నైట్ లో రాలేదు. ఎలాంటి బాగ్రౌండ్ లేకుండా తనకు తానే స్వయం కృషితో ఎదిగి ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకొని ‘వన్ అండ్ ఓన్లీ’ మెగాస్టార్ గా నిలబడ్డారు చిరంజీవి. ఇపుడు చిరంజీవి.. ఖైధీ నెం 150 తో రీఎంట్రీ ఇస్తున్నారు. చిరంజీవి అనగానే చాలా చిత్రాలు మదిలో మెదులుతాయి. అయితే ఇందులో టాప్ చిత్రాలను పట్టుకునే ప్రయత్నం చేశాం. ఇంతకంటే గొప్ప సినిమాలు భవిష్యత్ లో మెగాస్టార్ నుండి వస్తాయని ఆశిస్తూ.. మెగాస్టార్ టాప్ టెన్ చిత్రాలపై ఓ లుక్కేద్దాం.
ఖైదీ: (1983): స్టార్ గా చిరంజీవిని ఒక్కసారికి పదిమెట్లు ఎక్కించిన చిత్రం ఖైదీ. చిరంజీవి కెరీర్ లో ఈ చిత్రం ఓ మైలురాయి. ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం.. అప్పటివరకూ వచ్చిన యాక్షన్ చిత్రాల కంటే భిన్నంగా వచ్చిన సినిమా ఇది. ఇలాంటి యగ్రసీవ్ యాక్షన్ యాంగిల్ ని అప్పటివరకూ ఏ హీరో టచ్ చేయలేదు. కొన్ని హాలీవుడ్ యాక్షన్ సన్నీవేషాలకు స్ఫూర్తి గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు పిచ్చపిచ్చగా నచ్చేసింది. చిరంజీవిలోని యాక్షన్ ను కొత్త కోణంలో ఆవిష్కారించింది ఖైదీ. ఓ గొప్ప సినిమాకి వుండాల్సిన ప్రధాన లక్షణం పాత్రలను ప్రేక్షకుడు రిలేట్ చేసుకోవడం. వీరభద్రయ్య (రావుగోపాల్ రావు) అరాచకాలను సూర్యం ( చిరంజీవి) ఎదురిస్తుంటే ప్రేక్షకులు సూర్యం పాత్ర మనదే అన్నంత ఇంటెన్స్ తో ఊగిపోయారు ఆ సినిమా చూస్తున్నప్పుడు. ఇది చాలు ఖైదీ విజయం ఎలాంటిదో చెప్పడానికి. ఇంకో హైలెట్.. మాధవి- చిరంజీవిల జోడి. చక్కటి సంగీతం కూడా కుదిరింది. ”రగులుతోంది మొదలుపొద’పాట ఓ ఊపు ఊపేసింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే ఛానల్ మార్చ బుద్ది కాదు.
అభిలాష: (1983 ) యండమూరి రాసిన నవల అభిలాష. ఈ సినిమాతో నవలా నాయకుడిగా ఎదిగాడు చిరంజీవి. అభిలాష ఓ సామాజిక అంశంపై తీసిన చిత్రం. నిజంగా సిరియస్ గా సాగాల్సిన సినిమా చిరంజీవి బాడీలాంగ్వేజ్, డైలాగులు అమాయకత్వంతో ఫన్ పండుతుంటుంది. ఈ సినిమాతోనే ఇళయరాజా-చిరంజీవిల కలయికల తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో విజ్రుభించింది.
పసివాడి ప్రాణం: (1987) : చిరంజీవి ని డ్యాన్సింగ్ స్టార్ ని చేసిన చిత్రం పసివాడి ప్రాణం. ఈ సినిమా నుండే తెలుగు తెరకు బ్రేక్ డ్యాన్స్ ను పరిచయం చేశారు చిరు. తెలుగు సినిమానే కాదు. యావత్ దేశాన్ని తన బ్రేక్ తో షేక్ చేశారు చిరు. మంచుకొండల్లో’బ్రేక్ బ్రేక్ బ్రేక్’ అని ఆయన డ్యాన్స్ చేస్తుంటే థియేటర్ ఊగిపోయేది. ఈ సినిమా తర్వాత కేలవం చిరంజీవి డ్యాన్సులేకే ఫ్యాన్స్ అయిపోయిన వారు లక్షల్లో వున్నారు. ఈ సినిమా కూడా మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఒక మర్డర్ మిస్టరీకి సస్పెన్స్ ను జోడించి తీసిన ఈ చిత్రం ఆద్యంతం గ్రిప్పింగా సాగుతుంది. ఈ సినిమా పిల్లలకి కూడా ఫేవరేట్.
రుద్రవీణ: (1988) ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ ను ఇవ్వలేకపోయింది. కానీ నటుడిగా చిరంజీవి గొప్పగా చెప్పుకునే మేటి చిత్రాల్లో రుద్రవీణది అగ్రస్థానం. చిరంజీవి లాంటి ఓ స్టార్ హీరో కమర్షియల్ అంశాలను పక్కకు పెట్టి కధను, దర్శకుడ్ని నమ్మి ఈ చిత్రాన్ని చేశారు. జాతీయ అవార్డులు అందుకున్న చిత్రమిది. ఇందులో ప్రతీ పాట ఓ ఆణిముత్యం. చిరంజీవిని నటుడిగా తృప్తి పరిచిన చిత్రాల్లో రుద్రవీణ ఒకటి.
జగదీకవీరుడు అతిలోక సుందరి: (1990): చిరంజీవి చేసిన ఫాంటసీ చిత్రంలో నెంబర్ వన్ చిత్రం జగదీకవీరుడు అతిలోక సుందరి. సోషియో ఫాంటసీ జోనర్ లో వచ్చిన చిత్రాలలో ఇదో క్లాసిక్. ఇప్పటికీ ఇలాంటి సినిమా మరొకటి రాలేదంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాతో ప్రేక్షకులను అద్భుత ప్రపంచంలోకి తీసుకువెళ్ళారు దర్శకుడు రాఘవేంద్రరావు. ఈ సినిమా కోసం ఇంద్రలోకం సృస్టించారు. హిమాళయ సౌందర్యలను వెండితెరపై అవిష్కారించారు. నిర్మాత అశ్వనీదత్ డేరింగ్ కు హాట్స్అప్ చెప్పాలి. ఎక్కడా ఖర్చుకు వెనకాడలేదాయన. ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి మరో ఆకర్షణ. ఆరుకు ఆరు పాటలు హిట్టే. ఇప్పటికీ ”అబ్బని తీయని దెబ్బ” సాంగ్ ప్రతీ వేడుకలో వినిపిస్తుంటుంది. జగదీక వీరుడిగా చిరంజీవి… అతిలోక సుందరిగా శ్రీదేవి.. జీవించేశారు. దీంతో థియేటర్లకు మళ్ళీ మళ్ళీ వరసకట్టారు జనాలు.
రౌడీ అల్లుడు : (1991) చిరంజీవి ఎంత వినోదాన్ని పంచగలడో నిరూపించిన చిత్రం రౌడీ అల్లుడు. ఆటో జానీ క్యారెక్టర్ ఇప్పటికీ చిరంజీవి ఫ్యాన్స్ గుర్తుపెట్టుకుంటారు. దర్శకుడు పూరి జగన్నాధ్ కేవలం ఆ పాత్రను బేస్ చేసుకుని అదే టైటిల్ తో మెగాస్టార్ కోసం కధ రాసుకున్నాడంటే ఆ పాత్ర పంచిన వినోదం ఎంతో అర్ధం చేసుకోవచ్చు. డ్యుయల్ రోల్స్ ను అద్భుతంగా పడించారు చిరంజీవి. వినోదం పంచడంలో ఈ సినిమా పీక్స్. ఈ సినిమాలో పాటలు కూడా హైలెట్. ‘అమలాపురం బుల్లోడ’మాస్ ను ఊపేసింది. చిలుక క్షేమమా..పాటైతే ఇప్పటికీ మెమొరికార్డుల్లో బద్రంగా వుంది.
గ్యాంగ్ లీడర్: (1991) చిరంజీవికి ఈ సినిమా ‘ఒకే దెబ్బకు రెండు పిట్టలు’ లా కలిసొచ్చింది. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను అటు మాస్ ఇమేజ్ ను పెంచడంలో ఈ సినిమా కీలక పాత్ర పోషించింది. అవుట్ లైన్ చూస్తే ఇదో మాస్ సినిమా అనిపిస్తుంది. కానీ పక్కా ఫ్యామిలీ సబ్జెక్టు. ఒక ఫ్యామిలీలో చిన్న తమ్ముడు తన కుటుంబం కోసం ఏం చేశాడు అన్నది ఈ సినిమా మెయిన్ లైను. కరెక్ట్ గా చెప్పాలంటే అన్నదమ్ముల స్టోరీ ఇది. అయితే దిన్ని పక్కా కమర్షియల్ సినిమాగా చేశారు. ఇందులో చిరంజీవి యాక్షన్ కు జనాలు ఫిదా అయిపోయారు. ”’రఫ్ఫాడిస్తా”, చేయి చూశావ ఎంత రఫ్ఫుగా వుందో.. లాంటి సిగ్నేచర్ డైలాగులు పలుగుతుంటే థియేటర్ దద్దరిల్లిపోయేది. ఇందులో పాటలు మరో హైలెట్. టైటిల్ సాంగ్ ఎవర్ గ్రీన్. ఇప్పటికీ దాన్ని ఎంట్రీ బిజీయంలో వాడుతుంటారు. అలాగే ‘వాన వాన’, ‘భద్రాచలం కొండ’ పాటలు ఇప్పటికీ చెవిలో మ్రోగుతూనే వుంటాయి.
ఘరానా మొగుడు: (1992) : అప్పటి వరకూ వున్న ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన సినిమా ఘరానా మొగుడు. తెలుగు సినిమా స్టామినాను చాటి చెప్పిన చిత్రమిది. ఈ చిత్రం టోటల్ కలెక్షన్ పది కోట్లు. పది కోట్లు అంటే మాటలు కాదు. అప్పటివరకూ ఏ తెలుగు సినిమా, తెలుగు సినిమానే కాదు సౌత్ లోనే నెంబర్ ఆన్ కలెక్షన్ ఇది. ఈ కలెక్షన్ చూసి యావత్ దక్షిణ చిత్ర పరిశ్రమ షాక్ అయ్యింది. అటు బాలీవుడ్ కి కూడా తెలుగు సినిమా స్టామిన ఏమిటో తెలిసొచ్చింది. ఈ సినిమా నుండి చిరంజీవి రేమ్యునిరేషన్ కూడా రెట్టింపయ్యింది. మొత్తంమ్మీద చిరంజీవి ని ఓ సూపర్ హీరోని చేసింది ఘరానా మొగుడు.
ఇంద్ర: (2002) చిరంజీవి కమర్షియల్ స్టామినాను మరోసారి చాటి చెప్పిన చిత్రం ఇంద్ర. ఆరోజుల్లో ఏకంగా ముఫ్ఫై కోట్ల కలెక్షన్స్ సాధించిన చిత్రమిది. ఇది ఆరోజుల్లో ఇండస్ట్రీ రికార్డ్. చిరంజీవి కెరీర్ లో మొదటి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా ఇంద్ర. ఈ సినిమాతో పరుచూరి బ్రదర్స్ మరోసారి తమ కలం పవర్ చూపించారు. తమది తిరుగులేని కాంబినేషన్ అని మరోసారి నిరూపించుకున్నారు. చిరంజీవి వేసిన వీణ స్టెప్పు ఇప్పటికీ సిగ్నేచర్ స్టెప్స్ లో నెంబర్ వన్ గా వుంది. ఇప్పుడు చిరంజీవినే మరిసారి ఖైదీ నెంబర్ 150లో మరో రకంగా ఈ స్టెప్ ను రిమేడ్ చేశారట.
ఠాగూర్ (2003): మెగాస్టార్ కెరీర్ లో మరో మెగా ఠాగూర్. తమిళ్ లో వచ్చిన ‘రమణ’ చిత్రానికి రీమేక్ ఇది. అయితే ఈ సినిమా అక్కడ బాగా సిరియస్ గా సాగుతోంది. తెలుగులో వచ్చేసరికి చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు పూర్తిగా మార్పులు చేశారు. కలెక్షన్ పరంగా ఈ సినిమా సునామీ సృస్టించింది. ఠాగూర్ కి ఓ అరుదైన రికార్డ్ వుంది. అప్పటి లెక్కల ప్రకారం అత్యధిక థియేటర్లలో వందరోజులు ఆడిన సినిమా ఇది. అటు సందేశం పరంగా అటు కమర్షియల్ గా చిరంజీవి కెరీర్ లో నెంబర్ వన్ గా నిలిచిన చిత్రం ఠాగూర్.