లేడీ గెటప్పులంటే మన హీరోలకు భలే సరదా. ప్రతీ కథానాయకుడూ ఎప్పుడో ఒకప్పుడు మీసం తీసేసి, చీర కట్టినవాళ్లే. రాజేంద్ర ప్రసాద్, నరేష్ లాంటి వాళ్లయితే – సినిమా మొత్తం చీరలోనే కనిపించిన సందర్భాలున్నాయి. చిరంజీవి కూడా లేడీ గెటప్పుతో అదరగొట్టిన వైనం మనం మర్చిపోలేం. ‘చంటబ్బాయి’ సినిమాలోని ఓ పాటలో చిరు అమ్మాయిలా మారిపోయాడు. చిరుని మీసం లేకుండా, లేడీ గెటప్పులో చూడడం అదే మొదలు. అదే చివర కూడా.
చంటబ్బాయి లోని ఓ పాట కోసం జంథ్యాల చిరుతో రకరకాల గెటప్పులు వేయించారు. అందులో చార్లిచాప్లిన్, లేడీ గెటప్పులు ప్రధానమైనవి. ఈ రెండు గెటప్పుల విషయంలోనే చిరు బాగా సంశయించాడట. చార్లి చాప్లిన్ గెటప్ వేయడానికి భయపడిన చిరు… ఇంటి దగ్గర మేకప్ టెస్ట్ చేయించుకుని, ఓ ట్రైల్ షూట్ చేసి, నమ్మకం కుదిరాకే, సెట్స్‌పైకి వెళ్లార్ట.
ఇక లేడీ గెటప్ కథ. అందకు ముందు ఆడ వేషం వేయమని ఎవరూ అడగలేదు. జంథ్యాల అలా అడిగేసరికి.. ముందు చిరుకి సిగ్గేసిందట. అలా కనిపిస్తే, ఫ్యాన్స్ ఎలా స్వీకరిస్తారో, అనే భయం కూడా కలిగిందట. కానీ.. కొత్తగా ఉంటుందన్న ధీమాతో లేడీ గెటప్పుకి సై అన్నారు. ఆ రోజు షూటింగ్ అయిపోయిన వెంటనే, అదే గెటప్పుతో చిరు ఇంటికి వెళ్లార్ట. చిరుని అలా చూసి.. శ్రీమతి సురేఖ కూడా గుర్తు పట్టలేదట. పిల్లలు కూడా `అమ్మా.. ఈ ఆంటీ ఎవరు` అంటూ సురేఖని అడిగార్ట. తాను నోరు విప్పేంత వరకూ ఎవరూ తనని గుర్తించలేదని చిరు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఆడ వేషంలో చిరు ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసినా,.. శ్రీమతిని మాత్రం మెప్పించలేకపోయార్ట. `ఇంకెప్పుడూ ఇలాంటి గెటప్పులు వేయకండి. మీకు మళ్లీ మీసాలు వచ్చేంత వరకూ నా దగ్గరకు రాకండి` అంటూ ఓ స్వీట్ వార్నింగ్ విసిరార్ట సురేఖ. నిజంగా ఆ తరవాత.. చిరు ఎప్పుడు మీసాలు తీసేంత సాహసం చేయలేదు.