ఈమధ్య చిరంజీవికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రేమ, అభిమానం, గట్రా బాగా పెరిగిపోతున్నాయి. జగన్‌పై చిరు చేసిన తాజా ట్వీట్ ఇందుకు నిదర్శనం. ఏపీలో వాక్సినేషన్ కార్యక్రమం మహా జోరుగా సాగుతోందని, ఓకే రోజు రికార్డు స్థాయిలో వాక్సిన్లు వేయించారని, ఇదంతా జగన్ ఘనత అని – ఆయన్ని మెచ్చుకుంటూ ఓ ట్వీట్ చేశారు. ఆదివారం నాడు… రికార్డు స్థాయిలో వాక్సినేషన్ కార్యక్రమం జరిగిన మాట వాస్తవమే. అందుకే చిరు నుంచి ఈ ట్వీట్ వచ్చింది. అయితే ఈ ట్వీట్ ని రాజకీయాలకు అతీతంగానే చూళ్లేం. జగన్ వ్యతిరేకులు, చిరు అభిమానులు సైతం.. ఈ ట్వీట్ లో రాజకీయక కోణాలు వెతకడం మొదలెట్టారు. చిరుకి జగన్ పై ఇంత ప్రేమ పొంగుకు రావడానికి తమదైన రీతిలో కారణాలు విశ్లేషిస్తున్నారు.
జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర్నుంచి – ఇప్పటి వరకూ చిత్ర సీమపై జగన్ కారాలూ, మిరియాలూ నూరుతూనే ఉన్నారు. అప్పట్లో చంద్రబాబు సీఎమ్‌గా ఉన్నప్పుడు అయిన దానికీ, కాని దానికీ సినిమా వాళ్లు ఆయన్ని రాసుకుపూసుకుని తిరిగేవారు. చిత్రసీమకు సంబంధించిన ఏ నిర్ణయమైనా, ఏ కార్యక్రమమైనా చంద్రబాబు ఆలోచనలు, హాజరు తప్పనిసరి. కానీ జగన్ ని చిత్రసీమ దూరం పెట్టింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తరవాత టాలీవుడ్ నుంచి అభినందనలు చెప్పేవాళ్లే కరువయ్యారు. రాష్ట్రం రెండుగా విడిపోవడం, చిత్రసీమ మొత్తం హైదరాబాద్ లోనే సెటిల్ అవ్వడంతో – కేసీఆర్‌కి ఇచ్చిన ప్రాధాన్యత జగన్ కి ఇవ్వలేదు. ఇదంతా జగన్ గమనిస్తూనే ఉన్నాడు. అందుకే ఏపీ ప్రభుత్వం నుంచి చిత్రసీమకు ఎలాంటి వరాలూ, భరోసాలూ దక్కలేదు. పైగా ఇటీవల అక్కడ టికెట్ రేట్లు బాగా తగ్గించారు. ఇది పెద్ద సినిమాలకు శాపంగా మారింది.
టికెట్ రేట్లు తగ్గించాలంటూ జగన్ పై ఒత్తిడి తేవాలన్నా… చిత్రసీమకు కొన్ని వరాలు దక్కించుకోవాలన్నా.. జగన్ ని ప్రసన్నం చేసుకోవడం చాలా అవసరం. అందుకే… చిరు తొలి అడుగు వేసి, ఇలా ట్వీట్ల రూపంలో ఆయన్ని దువ్వడం మొదలెట్టాన్నది కొందరి వాదన. చిరు ట్వీట్ కి వస్తున్న స్పందన, కింద అభిమానుల కామెంట్లు చూస్తేనే ఈ విషయం అర్థం అవుతోంది. ఏపీలో కంటే మిగిలిన రాష్ట్రాల్లోనే వాక్సిన్ ప్రక్రియ జోరుగా సాగుతుందని.. ఆధారాలతో సహా.. రీ ట్వీట్లు చేసి చూపిస్తున్నారు నెటిజన్లు. ఆదివారం వాక్సినేషన్ ప్రక్రియ బాగానే సాగింది.. సోమవారం మాటేంటి? అంటూ.. ఎదురు ప్రశ్నిస్తున్న వాళ్లు, ఆ లెక్కలు చూపిస్తున్నవాళ్లు ఎందరో..? వాక్సినేషన్ ప్రక్రియపై మాట్లాడిన చిరు.. మిగిలిన అసమర్థ ఆలోచనలు, విధానాలపైనా నోరు విప్పాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా చిరు ట్వీట్… పవన్ అభిమానులకు నచ్చడం లేదు. వాళ్లదో దారి. మొత్తానికి ఓ చిన్న ట్వీట్ తో చిరు జగన్ ని ప్రసన్నం చేసుకోగలిగాడేమో గానీ, కొన్ని విమర్శల్ని కూడా నెత్తిమీద వేసుకోవాల్సివస్తోంది.