స్టీల్ ప్లాంట్ ఆక్సిజన్ సరఫరా చేస్తూ.. లక్షల మంది కరోనా పేషంట్ల ప్రాణం నిలుపుతూండటం చాలా మందిని కదిలిస్తోంది. అలాంటి స్టీల్ ప్లాంట్‌ను నిర్ధాక్షిణ్యంగా నష్టాల పేరుతో వందకు వంద శాతం.. ప్రైవేటుకు అమ్మేయాలనుకోవడం.. ఏమిటన్న చర్చ కూడా నడుస్తోంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి.. ఈ చర్చకు మరింత ఆజ్యం పోశారు. కీలకమైన ట్వీట్ చేసారు. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని ప్రైవేటీకరణ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తూ చిరంజీవి ట్వీట్ చేశారు. మీరే ఆలోచించండి..అని ముక్తాయింపునిచ్చారు.
చిరంజీవి హఠాత్తుగా భావోద్వేగంతో ఈ ట్వీట్ పెట్టడానికి కారణం.. పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ ఆక్సీజన్‌ను ఉత్పత్తి చేస్తూ కరోనా పేషంట్ల ప్రాణాలను కాపాడటమే. రోజుకు వంద టన్నుల ఆక్సీజన్‌ను స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేస్తూ.. లక్షల మంది ప్రాణాలను కాపాడుతోందని.. చిరంజీవి ట్వీట్లో గుర్తు చేశారు. గతంలో కూడా.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చిరంజీవి ట్వీట్ చేశారు. తాను కూడా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం జరిగిన విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు పోరాటంలో పాల్గొన్నానని చెప్పారు. ఇప్పుడు.. స్టీల్ ప్లాంట్ ఆక్సీజన్ ఉత్పత్తి చేస్తున్నందున ప్రైవేటీకరణ వద్దని చిరంజీవి కోరుతున్నారు.
అయితే చిరంజీవి ట్వీట్ లక్ష్యమేమిటో.. ఎవరిని ఆలోచించాలని అంటున్నారో మాత్రం క్లారిటీ లేదు. ఎవరి కోసం ఈ ట్వీట్ చేశారో వారికి ట్యాగ్ చేయలేదు. అసలు ఎవరికీ ట్యాగ్ చేయలేదు. అయితే.. ఈ ప్రైవేటీకరణను చేస్తోంది కేంద్రం కాబట్టి… కేంద్ర ప్రభుత్వానికే విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేసినట్లుగా భావిస్తున్నారు. మామూలుగా అయితే.. ఈ ట్వీట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు.. స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో భాగస్వాములైన ప్రముఖులకో… ట్యాగ్ చేస్తారు. చిరంజీవి అలా చేయకపోవడం వల్ల.. ఫ్యాన్స్ కోసమే ట్వీట్ చేశారన్న భావన ఏర్పడుతోంది.