రామ్ చరణ్ సినిమా అంటే… తెర వెనుక కర్త, కర్మ, క్రియ అన్నీ చిరంజీవి అనేది తెలిసిన విషయమే. చరణ్ ప్రతీ సినిమాకీ అనధికార దర్శకుడు చిరంజీవినే. సినిమా మొత్తం జోక్యం చేసుకోకపోయినా, పూర్తయిన తరవాత రషెష్ చూడడం, తనవంతు సలహాలు ఇవ్వడం, అవన్నీ దర్శకుడు పాటించడం పరిపాటి. ‘రంగస్థలం’ కథ చిరు `ఓకే` అంటేనే సెట్స్‌పైకి వెళ్లింది. ఒక్కసారి సెట్స్‌పైకి వెళ్లాక చిరు పెద్దగా జోక్యం చేసుకోలేదనే చెప్పాలి. అయితే `రంగస్థలం` రషెష్ చూసిన తరవాత చిరు కాస్త నిరుత్సాహానికి గురైనట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్. ఒకటి రెండు సన్నివేశాల పట్ల చిరు అభ్యంతరం చెప్పారని, వాటిని మరింత ఫైన్ ట్యూన్ చేయాల్సిన అవసరం ఉందని చిరుభావించార్ట. వాటిని మరోసారి రీషూట్ చేయమని సూచించినట్టు తెలుస్తోంది. అయితే రామ్ చరణ్ మాత్రం సుకుమార్‌ని వెనకేసుకుని వస్తున్నాడని టాక్. ‘సుకుమార్ మైండ్ సెట్ వేరు… ఈ సినిమాకి మాత్రం తన ఛాయిస్‌కే వదిలేద్దాం’ అని చరణ్ చెబుతున్నాడట. చివరికి అయిష్టంగానే చరణ్ మాటలకు చిరు కన్వెన్స్ అయినట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీస్ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సమంత కథానాయిక. ఇప్పటికే టీజర్ విడుదలైంది. త్వరలో సమంత లుక్‌ని బయటపెడతారు.