చిరంజీవి పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్ చేసేందుకు అభిమానులు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే చిరంజీవి మాత్రం తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులందరూ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొనాలని ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరిత్యాలు తగ్గాలంటే, కాలుష్యానికి చెక్ పెట్టాలంటే, భవిష్యత్ తరాలు బావుండాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని చిరంజీవి తన సందేశంలో పేర్కొన్నారు.
ఇలా చేయడానికి టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన హరితయజ్ఞం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో పాల్గొంటే చాలని పిలుపునిచ్చారు. అందూర మూడు మొక్కలు నాటి .. తనకు ట్విట్టర్ లో ట్యాగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. జోగినిపల్లి సంతోష్ కుమార్ ఉద్యమానికి ఇప్పటికి అనేక మంది మద్దతు తెలిపారు. ప్రభాస్ అయితే ఓ అడవినే దత్తత తీసుకున్నారు. టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ హీరోలు.. హీరోయిన్లు కూడా సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను ఫాలో అయి మొక్కలు నాటారరు. చిరంజీవి ఇలా పిలుపునివ్వడంతో ఎంపీ సంతోష్ కుమార్ సంతోషించారు.
మెగాస్టార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రకృతి పరిరక్షణపై మెగాస్టార్ కి ఉన్న ప్రేమను తెలియజేస్తున్నదని, ఆయన పుట్టిన రోజున అభిమానులంతా మొక్కలు నాటి చిరు కానుకను అందించాలని ఆకాంక్షించారు. ఎంపీ సంతోష్ కుమార్ కేసీఆర్‌కు సమీప బంధువు. ఆయన పవర్ సెంటర్లలో ఒకరన్న ప్రచారం కూడా ఉంది. అయన రాజకీయాల్లో ఎక్కువగా కనిపించరు కానీ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో మాత్రం చురుకుగా ఉంటారు.