ధృవ తరవాత సురేందర్ రెడ్డి చిరంజీవితో సినిమా చేయొచ్చు.. అనుకొన్నప్పుడు ఇదేదో ధృవ పబ్లిసిటీ స్టంట్ అనుకొన్నారు. సాధారణంగా మెగా హీరోలతో ఏ దర్శకుడు సినిమా చేసినా… తదుపరి సినిమా పవన్తోనో, చిరుతోనో అని చెప్తుంటారు. తమ సినిమాల ప్రమోషన్లలో భాగంగా చిరు, పవన్‌ల పేర్లు వాడేస్తుంటారు. ధృవకీ అదే సీన్ రిపీట్ అవుతోందనుకొన్నారంతా. అయితే చిరు 151వ సినిమా కోసం సూరిని దర్శకుడిగా ఎంపిక చేసి చిరు గట్టి షాకే ఇచ్చాడు. అయితే.. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి స్క్రిప్టు సూరి డీల్ చేయాలి అనగానే.. మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్లు తీసే సూరికి ఈ స్క్రిప్టు వర్కవుట్ అవుతుందా? అనే భయాలు వెన్నాడాయి. సూరి తప్పని పరిస్థితుల్లో ఈ బాధ్యత భుజాన వేసుకొన్నాడని, చారిత్రక నేపథ్యంలో సాగే సినిమా తీయడం సూరికి ఇష్టం లేదన్నవార్తలు వినిపించాయి. ఈ వార్తలు షికార్లు చేస్తున్న తరుణంలోనే చిరంజీవి – సురేందర్ రెడ్డిలతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రాజెక్టు దాదాపుగా ఫైనలైజ్ అయిపోయింది.
సూరి ఈ సినిమాకి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాడిప్పుడు. ఇలాంటి కథలతోనూ మెప్పించగలను అని నిరూపించుకోవడానికి ఇదే మంచి ఛాన్స్. పైగా మెగాస్టార్‌తో సినిమా. అందుకే స్క్రిప్టు విషయంలో పక్కా జాగ్రత్తలు తీసుకొన్నాడు. ఈ కథని ఓన్ చేసుకోవడానికి కాస్త టైమ్ తీసుకొన్నాడట సూరి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి మరింత సమాచారం సేకరించి, పరుచూరి ఇచ్చిన స్క్రిప్టుకు తుదిమెరుగులు దిద్ది.. చిరుకి ఫైనల్ వెర్షన్ వినిపించాడట. సూరి కథ చెప్పిన విధానం చూసి చిరు ఫ్లాటైపోయాడని, ‘నీకు ఎలా కావాలంటే అలా తీయ్.. నీకు కావల్సిన టెక్నీషియన్స్‌నే తీసుకో’ అంటూ ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడట. పరుచూరి రాసిన స్క్రిప్టుని పూర్తిగా మార్చుకొన్నాడని, తన స్టైల్లోకి తీసుకొచ్చాడని, సూరి మార్క్.. ఈ సినిమాలో తప్పకుండా కనిపిస్తుందని మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి.