చిరంజీవి మంచి చమత్కారి! సినిమా వేడుకల్లోనూ… మీడియా సమక్షంలోనూ… అందర్నీ ఆకట్టుకునేలా మాట్లాడతారు. సందర్భానుసారంగా మాట్లాడడంలోనూ… నవ్వులు పూయించడంలో… మెగా హీరోల్లో ఆయన తర్వాతే ఎవరైనా. తమ్ముడి కొడుకు వరుణ్‌తేజ్ నటించిన ‘తొలిప్రేమ’ చక్కటి విజయం సాధించిన సందర్భంగా శుక్రవారం ఉదయం చిత్ర బృందాన్ని ఇంటికి పిలిచి సత్కరించారు. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి శాలువాలు కప్పే సమయంలో వరుణ్ వంతు వచ్చింది. అప్పుడు చిరు వేసిన పంచ్ డైలాగ్ ‘వీడికి శాలువా కప్పాలంటే నేను కుర్చీ వేసుకోవాలి’కి అక్కడున్న వారంతా నవ్వకుండా ఉండలేకపోయారు. ఆఖరికి వరుణ్‌తో సహా! వరుణ్ ఎంత ఎత్తు (6.4 అడుగులు) ఉన్నాడనే విషయాన్ని చిరు మరోసారి అందరికీ గుర్తు చేశారు. మెగా హీరోల్లో, ఆ మాటకు వస్తే తెలుగు హీరోల్లో వరుణ్ అందరి కన్నా పొడుగు. చిరు ఏమో 5.8 అడుగులు. తమ్ముడి కొడుక్కి మనస్ఫూర్తిగా శాలువా కప్పాలంటే చిరుకి కచ్చితంగా కుర్చీ అవసరమే. లేదంటే వరుణ్ కొంచెం బెండ్ అవ్వాలి.