మంచు మనోజ్ కొత్త సినిమా గుంటూరోడు సినిమాకి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నిజానికి ఈ సినిమాలో రామ్ చరణ్ గొంతు వినిపించాల్సిందట. చరణ్‌కి ఖాళీ లేకపోవడం వల్ల చిరు వచ్చి తన గొంతు ఇవ్వాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని మంచు మనోజ్ స్వయంగా వెల్లడించాడు. ముందు చరణ్‌ని అడిగితే సరే అన్నాడట. అయితే… తాను ఊర్లో లేకపోవడం వల్ల హైదరాబాద్ రావడానికి పది రోజులైనా టైమ్ పడుతుందని చెప్పడంతో మరో ఆప్షన్ వెదుక్కోవాల్సివచ్చిందట. ఓరోజు మోహన్ బాబు కుటుంబం.. చిరు ఇంటికి బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్తే… అక్కడ టైమ్ చూసుకొని చిరుని వాయిస్ ఓవర్ విషయంలో రిక్వెస్ట్ చేశాడట మనోజ్. తాను అడిగిన వెంటనే చిరు ఒప్పుకోవడంతో.. గుంటూరోడులో చిరు వాయిస్ ప్లస్ అయ్యింది.
”చరణ్ ఊర్లో లేడు. తాను రావడానికి టైమ్ పడుతుంది. అందుకే చిరంజీవి అంకుల్ని అడిగాం. అడిగిన వెంటనే ‘టైమ్ ఎంత ఉంది’ అని అడిగారు. ‘రెండ్రోజుల్లో చెప్పేయాలి..’ అన్నా. ‘రెండ్రోజులెందుకు.. ఈరోజే చెప్పేస్తా’ అన్నారు అంకుల్. నిజంగా… ఆయన పెద్ద మనసుకి థ్యాంక్స్. చిరంజీవి గారు వాయిస్ ఓవర్ ఇచ్చాక చరణ్‌ని ఫోన్ చేశా. ‘పిట్ట కోసం వెదికితే నీకు పులే దొరికింది’ అన్నాడు చరణ్. నిజంగా.. అది నిజం” అని చెప్పుకొచ్చాడు మనోజ్. చిరు వాయిస్ ఓవర్ సినిమా అంతటా దఫదఫాలుగా వస్తుందట. కథనీ, పాత్రల్నీ పరిచయం చేస్తూ, కథని ముందుకు నడిపించడంలో చిరు గొంతు సహకరించిందంటున్నాడు మనోజ్. ఈ చిత్రం మార్చి 3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి చిరు గొంతు ఈ సినిమాకి ఎంత వరకూ ప్లస్ అవుతుందో చూడాలి.