తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నంది అవార్డులని గద్దర్ అవార్డుల పేరిట ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటన పై ఇప్పటివరకూ పరిశ్రమ నుంచి అనుకున్న స్పందన రాలేదు. అయితే అందరూ ఎదురుచూస్తున్న మెగాస్టార్ స్పందన ఇప్పుడు వెలువడింది. పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఈ కార్యక్రమం జరిగింది.
పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన చిరంజీవి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు పద్మశ్రీ అవార్డులు అందుకోనున్న వారిని సీఎం, మంత్రులు సత్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. నంది అవార్డులకు ప్రజా గాయకుడు గద్దర్ పేరు పెట్టాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సముచితమైందని పేర్కొన్నారు చిరు. ‘నంది అవార్డులు గత చరిత్రలా అయిపోయాయి. వాటిని త్వరలో ఇస్తామని సీఎం ప్రకటించడం ఆనందదాయకం. ఆ అవార్డులకు గద్దర్ పేరు పెట్టాలనే నిర్ణయం ఎంతో ఆనందకరం’ అని తన స్పందన తెలియజేశారు చిరు.