వాల్తేరు వీరయ్యతో ఓ సూపర్ హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు అందరి దృష్టీ.. భోళాశంకర్పైనే. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. తమన్నా కథానాయిక. చిరుకి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. షూటింగ్ దాదాపుగా 80 శాతం పూర్తయ్యింది. ఆగస్టు 11న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్రబృందం ఇది వరకే ప్రకటించింది. అయితే.. ఈ సినిమా అప్పటికి రెడీ అయినా, విడుదల మాత్రం డౌటే అని వార్తలొచ్చాయి. ఇప్పుడు భోళా శంకర్ నుంచి ఓ క్లారిటీ వచ్చేసింది. మే డే సందర్భంగా భోళాశంకర్ కొత్త పోస్టర్లు విడులదయ్యాయి. ఈ పోస్టర్లపై మరోసారి ఆగస్టు 11నే రిలీజ్ డేట్ కనిపించింది. సో.. ఆగస్టు 11న ఈ సినిమా రావడం పక్కా అయినట్టే.
నిజానికి ఆగస్టు 11 చాలా మంచి డేట్. ఆగస్టు 15న సెలవు కలిసొస్తుంది. అంటే.. భోళాకి లాంగ్ వీకెండ్ దక్కుతుందన్న మాట. ఇంత మంచి రిలీజ్ డేట్ ని ఎవరు వదులుకొంటారు? పైగా సినిమా దాదాపుగా అయిపోవొచ్చింది. ఆగస్టు దాటితే.. దసరా వరకూ మంచి రిలీజ్ డేట్ దొరకదు. అప్పటి వరకూ సినిమాని ఎందుకు ఆపాలి? అందుకే ఆరు నూరైనా.. ఆగస్టు 11నే భోళాని దింపాలని చిరు ఫిక్సయ్యాడు.