చిరంజీవి సినిమా అంటే డాన్సులు, పాటలూ.. మామూలుగా ఉండవు. చిరుకి ప్రత్యేకంగా క్రేజ్ తీసుకొచ్చినవి అవే. వయసు పెరుగుతున్నా – అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడూ అంటూ సిగ్నేచర్ స్టెప్పు వేయాల్సిందే. అప్పుడే ఫ్యాన్స్కి ఆనందం. అయితే.. ‘గాడ్ ఫాదర్’లో ఈ కమర్షియాలిటీని పక్కన పెట్టారు. ఇందులో నయన తార లాంటి కథానాయిక ఉన్నా చిరు, నయనలకు డ్యూయెట్లు లేవు. పాటలన్నీ కథలో భాగంగానే వస్తాయి. ‘తార్ మార్’ పాట.. ఎండ్ టైటిల్స్ లో వేస్తారు. ఓ ఐటెమ్ సాంగ్ ఉన్నా.. అందులో చిరంజీవి కనిపించడు. ఇలా చిరు డ్యూయెట్లు పాడని సినిమా ఏదైనా ఉందీ అంటే అది ఇదేనేమో..?
ఈరోజు ‘నజభజజజర’ అనే పాటని విడుదల చేశారు. ఇది యాక్షన్ మోడ్లో సాగే పాట. ‘సిత్తరాల సిరపడు’ పాటని యాక్షన్ సీన్లో వాడినట్టే.. ఇప్పుడు ఈ ‘నజభజజజర’ని యాక్షన్ సీన్లో ఫిక్స్ చేశారు. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటలోని లిరిక్స్ మంచి స్వింగ్లో సాగిపోయాయి. ”చొక్కా మడత పెట్టి వచ్చాడంటే టేకు దుంగ మీద గొడ్డలి వీడు… మీస కట్టు గానీ తిప్పాడంటే మద్ది చెక్క మీద రంపామవుతాడు.. అడ్డు వచ్చినోడ్ని అడ్డదిడ్డముగా నొక్కేసి పోతాడురా..” అంటూ చిరులోని హీరోయిజాన్ని ఓ లెవిల్లో చూపించారు. ఈ ఫైట్ కమ్ పాటని… రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేశారు.