వెండితెర భారీదనాన్ని కోరుకొంటోంది. పాట, ఫైటు ఏదైనా ఇది వరకు చూడని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాల్సిందే. అందుకోసం దర్శక నిర్మాతలు అహర్నిశలూ కష్టపడుతున్నారు. పాటల కోసం, ఫైట్స్ కోసం రోజుల తరబడి శ్రమిస్తున్నారు. చిరంజీవి `విశ్వంభర` కోసం కూడా అదే జరుగుతోంది. చిరు – వశిష్ట కాంబోలో రూపుదిద్దుకొంటున్న చిత్రమిది. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఇంట్రవెల్ బ్యాంగ్ లో వచ్చే ఫైట్ రూపొందిస్తున్నారు. ఈ ఫైట్ కోసం 26 రోజుల కేటాయించారు. ఓ ఫైట్ ఇన్ని రోజులు తెరకెక్కించడం చిరు కెరీర్లో ఇదే తొలిసారి. రామ్ లక్ష్మణ్ ఈ పైట్కి కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఏ.ఎస్.ప్రకాష్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శివార్లలో ఓ భారీ సెట్ రూపొందించారు. అక్కడే ఈ ఫైట్ తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ఈ ఫైట్ ఉండబోతోందని చిత్రబృందం ధీమాగా చెబుతోంది. చిరు భీమవరం దొరబాబుగా నటిస్తున్న ఈ సినిమాలో త్రిష కథానాయిక. ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు. 2025 సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.