మెగాస్టార్ చిరంజీవి 7 ఏళ్ల తర్వాత స్క్రీన్ పై మెరవనున్నారు. తనయుడు రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమాలో మెరుపులా కనిపించడానికి రెడీ అయ్యాడు మెగాస్టార్. మెగా అభిమానులు పండుగలా భావిస్తున్నారు. అయితే అభిమానులు టెన్షన్ పెడుతున్న మరో న్యూస్ ఎంటంటే ఈ సినిమాలో చిరు నిడివి గురించి. డైరక్టర్ శ్రీనువైట్ల మొదట బ్రూస్ లీలో చిరు ఎపిసోడ్ ని పావుగంట పాటు ఉండేలా రాసుకున్నా చివరకు దాన్ని తగ్గించారనేది సమాచారం. కేవలం 3 నిమిషాలు మాత్రమే చిరు అలా వచ్చి ఇలా వెళ్తాడని ఫిల్మ్ నగర్ టాక్.
మొదట పావు గంట ఎపిసోడ్ ఓ ఐటం సాంగ్ అని వినబడ్డా ఇప్పుడు కేవలం 3 నిమిషాలు మాత్రమే చిరు కనిపిస్తారన్నది ఎక్స్ క్లూజివ్ టాక్. ఈరోజు మొదలైన బ్రూస్ లీలో చిరు ఎపిసోడ్ మూడు రోజుల పాటు జరుగనున్నదట. కనిపించేది తక్కువ సమయమే అయినా మెగాస్టార్ ఎంట్రీ సీన్ మాత్రం అత్యంత భారీగా ప్లాన్ చేస్తున్నారని టాక్. ఠాగూర్, స్టాలిన్ సినిమాల మాదిరి అభిమానుల జనసందోహంలో మెగాస్టార్ రీ ఎంట్రీ ఉంటుందని అంచనా.
ఈ ఎపిసోడ్స్ సినిమాకే హైలెట్ అవ్వనుండటం విశేషం. అంతేకాదు చిరు కనిపించే సీన్స్ అన్నీ జాగ్రత్తగా వచ్చేలా చరణ్ కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాడట. సో మొత్తానికి చిరు 150వ సినిమాకు ట్రైలర్ లా వస్తున్న బ్రూస్ లీ సినిమాలో మరోసారి మెగాస్టార్, మెగా పవర్ స్టార్ ఇద్దరు రెచ్చిపోతారన్నది తెలిసిపోయింది. మరి ఇన్ని హంగులతో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి.