చిరంజీవి కథానాయకుడిగా మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాబి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో రవితేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన సెట్లోకి అడుగు పెట్టారు. ఈ సినిమాలో చిరంజీవి – రవితేజ అన్నదమ్ములుగా కనిపిస్తారని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. నిజానికి.. ఇందులో వీరిద్దరూ సవతి సోదరులు. వారిద్దరి మధ్యా ఉండే పోరే…. ‘వాల్తేరు వీరయ్య’ కథ. సవతి సోదరులు అనగానే మనకు చాలా కథలు గుర్తొస్తాయి. వాటిలో ‘బలరామకృష్ణులు’ ఒకటి. నాని నటించిన ‘టక్ జగదీష్’ కూడా ఈ నేపథ్యంలో సాగే కథే. అయితే… `వాల్తేరు వీరయ్య`కీ ఈ రెండు కథలకూ ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నాడు బాబి. చిరంజీవి – రవితేజ మధ్య క్లాషే.. ఈ సినిమాకి మూలం. ఆ క్లాష్ ఎలా ఉండబోతోందన్నది తెరపైనే చూడాలి. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే నాలుగు మాస్ సాంగ్స్‌ని కంపోజ్ చేసి ఇచ్చినట్టు తెలుస్తోంది. చిరంజీవి – దేవిశ్రీ ప్రసాద్‌ల కాంబోలో అన్నీ హిట్ గీతాలే వచ్చాయి. ఈసారీ అలాంటి ఆల్బమ్ రెడీ అవుతున్నట్టు టాక్.