ఆచార్యతో చిరంజీవి ఫ్యాన్స్ దారుణంగా డీలా పడిపోయారు. అన్ని వైపుల నుంచీ విమర్శలే. ఆ సినిమా ఓపెనింగ్స్ కూడా నిరాశకు గురి చేశాయి. చిరంజీవి ఇక రిటైర్ అయిపోవొచ్చేమో..? అనేంతగా భయపెట్టాయి. అయితే… చిరు `గాడ్‌ఫాదర్`తో బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకొన్నారు. ఈ సినిమాలో చిరు పెర్‌ఫార్మ్సెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, ఈ సినిమాకి వస్తున్న స్పందన, వసూళ్లు.. ఇలా… అన్ని విధాలుగానూ అభిమానులకు ఊపిరి పోశాయి.
నిజానికి లూసీఫర్ రీమేక్ అనగానే ఫ్యాన్స్ కూడా నిరుత్సాహ పడిపోయారు. లూసీఫర్ చిరంజీవి టైపు సినిమా కాదు కదా, అని భయపడ్డారు. ఇందులో పాటల్లేవు, చిరు సినిమాల్లో రొటీన్ గా కనిపించే కామెడీ, రొమాన్స్ ఏమీ లేవు. అవి లేకుండా కూడా చిరు మెప్పించగలడు… అని గాడ్ ఫాదర్ నిరూపించింది. చిరు వయసు పైబడింది. ఇప్పుడు కూడా డాన్సులు, రొమాన్సులతోనే అభిమానుల్ని మెప్పించాలని అనుకోవడం అత్యాసే. చిరు రూటు మార్చాల్సిన వేళ.. గాడ్ ఫాదర్ ఓ పునాది రాయిగా ఉపయోగపడుతుంది. చిరుకి రీమేకులు బాగా కలిసొచ్చాయి. ఆయన రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెం.150 కూడా రీమేకే. తొమ్మిదేళ్ల తరవాత చిరంజీవి సినిమా చేసినా – అభిమానులు మళ్లీ అక్కున చేర్చుకొని భారీ వసూళ్లు అందించారు. ఆ తరవాత వచ్చిన సైరా, ఆచార్య… రెండూ వర్జినల్ కథలు. రెండూ నిరాశ కలిగించిన తరుణంలో మరో రీమేక్ చిరు కెరీర్‌కి ఊపిరిపోసినట్టైంది.