చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం `ఆచార్య`. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ని ఈనెల 22న విడుదల చేశారు. ధర్మస్థలి అనే ప్రాంతం నేపథ్యంలో సాగే కథ ఇది. నక్సలిజం అనే అంశం కథలో భాగం. చిరు నక్సలైట్ గా కనిపిస్తాడని ముందు నుంచీ ప్రచారం సాగుతూనే వుంది. దానికి తగ్గట్టుగానే ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ని డిజైన్ చేశాడు కొరటాల శివ.
ధర్మస్థలి అనే ప్రాంతాన్ని చూపిస్తూ, అక్కడ అణగారిన ప్రజల బాధలకు అద్దం పట్టేలా – వాతావరణాన్ని సృష్టించి, అక్కడి పరిస్థితులకు ఎదురొడ్డి తిరుగుబాటు చేసే పాత్రలో కథానాయకుడి పాత్రని పరిచయం చేశారు. దానికి తగ్గట్టుగానే ఫస్ట్ లుక్ డిజైన్ చేశారు. కథలోని చాలా కీలకమైన సన్నివేశం అట అది. ఓ సామాన్యుడు… పరిస్థితులపై, పెట్టుబడిదారులపై తిరుగుబాటు చేస్తూ… ఎర్రజెండా కప్పుకుని, పోరాటం చేసే సన్నివేశమే ఫస్ట్ లుక్‌గా వచ్చింది. అప్పటి వరకూ నక్సలిజంపై ఎలాంటి మంచి అభిప్రాయం లేని కథానాయకుడు, సడన్ గా ఆ విధానాలపై ఆకర్షిడుడై – అటువైపు అడుగులు వేసిన సందర్భంలో వచ్చే తొలి ఫైట్ అని, కథ అక్కడి నుంచే మలుపు తిరుగుతుందని తెలుస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ కథలోకి కీలకమైన సందర్భంలో వస్తుందని సమాచారం. అందుకే ఏరి కోరి ఈ లుక్‌ని దింపాడు కొరటాల శివ. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని పాటల్ని కంపోజ్ చేశారని తెలుస్తోంది. అందులో ఓ పాటని దసరాకి విడుదల చేసే అవకాశాలున్నాయని సమాచారం.