సైరా కథ దాదాపు 12 ఏళ్లు నలిగింది. పరుచూరి బ్రదర్స్ చిరంజీవి కోసం ఇష్టంగా తయారు చేసుకున్న కథ ఇది. ఈ కథ చెప్పినప్పుడే చిరు ఆసక్తి కనబరిచారు. కాకపోతే ఈ సినిమాకి కావల్సిన బడ్జెట్, అప్పటి చిరు మార్కెట్‌కి చాలా దూరంగా ఉంది. ఓ దశలో ఈ స్క్రిప్టుపై దాదాపు యేడాది పాటు పనిచేశారు. పట్టాలెక్కుతుంది అనగా… చిరు రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. అలా.. ఈ సినిమాకి మళ్లీ బ్రేకులు పడ్డాయి. చిరు ఇక సినిమాలు చేయరు, రాజకీయాల్లోనే ఉండిపోవాల్సివస్తుందని అనుకున్నప్పుడు ఈ ప్రాజెక్టుపై నీలి నీడలు కమ్ముకున్నారు. మరో హీరోతో చేస్తే ఎలా ఉండేదో అనే ఆలోచనలూ వచ్చాయి. అయితే ఎప్పటికప్పుడు వాటిని పక్కన పెడుతూ చిరంజీవి కోసమే ఎదురుచూశారు పరుచూరి సోదరులు.
ఓ దశలో `ఈ కథ చరణ్‌తో చేయొచ్చు కదా` అని చిరు సలహా కూడా ఇచ్చారు. కానీ పరుచూరి బ్రదర్స్ మాత్రం `ఈ సినిమా చేస్తే మీరే చేయాలి.. లేదంటే లేదు` అని పట్టుబట్టారు. అది ఇన్నాళ్లకు కార్యరూపం దాల్చింది. ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ చిరంజీవినే. ఏ హీరో చేసినా… ఇంత గ్రేస్ వచ్చేది కాదు. దేశానికి సంబంధించి, దేశ భక్తికి సంబంధించి ఎన్నో సంభాషణలు ఈ సినిమాలో ఉన్నాయి. అవన్నీ ఓ స్టేచర్ ఉన్న నటుడి చెబితేనే జనాల్లోకి వెళ్తాయి. చరణ్ చేసుంటే.. ఈ సినిమాకి సరికొత్త కలరింగు, ఇంకాస్త ఈజ్ వచ్చి ఉండేవి. కాకపోతే.. ఇంత గౌరవం దక్కేది మాత్రం కాదు. పైగా చిరంజీవికి ఎప్పటి నుంచో భగత్ సింగ్ లాంటి దేశభక్తుడి కథ సినిమాగా తీయాలన్నది కోరిక. పన్నెండేళ్ల క్రితం ఈ కథ చిరంజీవికి వినిపించనప్పుడు ఆయన ఉద్వేగానికి లోనైంది కూడా ఆ పాయింట్ దగ్గరే. అందుకే చిరు కోసం పరుచూరి బ్రదర్స్ ఇన్నాళ్లు ఆగారు. దానికి తగిన ప్రతిఫలం దక్కింది. చిరు ఈ సినిమా చేశాడంటే దానికి మూల కారణం పరుచూరి సోదరులే. చిరు రాజకీయాల్లోకి వెళ్లిపోయినప్పుడు.. తొందరపడి ఈ సినిమాని మరో హీరో చేతుల్లో పెట్టలేదు. చరణ్ చేస్తానన్నా ఒప్పుకోలేదు. చిరు కోసం ఇన్నాళ్లు ఎదురు చూశారు. అందుకే సైరా క్రెడిట్లో వాళ్లకూ వాటా ఉంది.